పిల్లల్ని పెరగనిద్దాం… పెంచొద్దు

0
811

    parents read king and butterfly birth story don't  too much love childrens

పిల్లల పై అతిమోహం వద్దు .. వారిని స్వశక్తితో ఎదిగేందుకు  సహకరిద్దాం … ప్రతీ తల్లిదండ్రులు చదవాల్సినది .

శూరసేనుడనే మహారాజు చాలా గొప్పవాడు. అతడు తన రాజ్యంలోని ప్రజలందరినీ కన్నబిడ్డలా చూసుకునేవాడు. ఇతని పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. ప్రజలు ఎవరి వృత్తులను వారు సక్రమంగా చేసుకునేవారు. అలా పరిపాలిస్తున్న మహారాజుకు ఓక కోరిక కలిగింది. గొంగళి పురుగు సీతాకోకచిలుక ఎలా అవుతుందో చూడాలి అనుకున్నాడు.

తన ఉద్యానవనంలో కొన్ని చెట్లకి గొంగళి పురుగులు ఉండడం చూసి పంట పండింది అనుకోని రోజు వచ్చి చూస్తూ ఉండేవాడు.ఒకరోజు గూడు కట్టుకొని ఉండేవి. మరలా వచ్చి చూసేసరికి సీతాకోకచిలుకలై ఎగిరిపోతూ ఉండేవి. ఇలా చాలారోజులు ప్రయత్నించాడు. కాని ఎప్పుడు సీతాకోక చిలుక పుట్టుక మాత్రం చూడలేకపోయేవాడు.

ఒకనాడు మంత్రిగారిని పిలిచి తన మనస్సులో కోరికను వెల్లడించాడు. మంత్రి విని వెంటనే ఆ గొంగళి పురుగులు ఉన్న చెట్టు దగ్గర భటులను నియమించి
”సీతాకోకచిలుక పుట్టే సమయాన్ని మాకు తెలియజేయండి” అని ఆదేశించాడు. భటులు అలాగే అని గొంగళిపురుగులు ఉన్న  చెట్టు దగ్గర కాపలా కాచి సీతాకోకచిలుక పుట్టే సమయాన్ని మంత్రిగారికి తెలియజేయగా, హుటాహుటిన రాజుగారిని వెంటబెట్టుకొని ఉద్యానవనానికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి గూడులో నుండి సీతాకోక చిలుక బయటికి రావడం మొదలైంది. రాజుగారు ఎంతో ఆసక్తిగా చూడడం మొదలుపెట్టాడు.

గూడులో నుండి మెల్లమెల్లగా బయటికి రావడం మహారాజు చూసి,  అయ్యో! ఎంత కష్టపడుతుందో! పాపం అనుకోని దగ్గరికి వెళ్లి ఆ గూడుని తన దగ్గర ఉన్న చాకుతో చిన్నగా, సీతకోకచిలుకకి ఏమి కాకుండా కోశాడు. అది బయటికి వచ్చి క్రింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంది. అది చూసి అయ్యయ్యో ఇది ఎగరలేకపోతుంది అని తన చేతుల్లోకి తీసుకొని పైకి ఎగరేశాడు. అయినా అది ఎగరలేక క్రిందపడిపోయి ఎగరడానికి ప్రయత్నిస్తుంది. కాని రెక్కలు విచ్చుకోకపోవడంతో అలా తన్నుకొని తన్నుకొని చనిపోయింది. అది చూసిన మహారాజు దుఃఖించాడు.

మంత్రివర్యా! ఏమిటి ఇలా జరిగింది. ఎందుకలా చనిపోయింది? అని అడిగాడు. అప్పుడు మంత్రిగారు ఇలా అన్నారు.మహరాజా! సృష్టిలో ప్రతీదీ తనకుతానుగా
ఎదగడానికి ప్రయత్నించాలి. అప్పుడే తన సామర్ధ్యం ఏమిటో తెలుస్తుంది. ఒక విద్యార్థి విద్య నేర్చుకునేటప్పుడు గురువు శిక్షిస్తాడు. అలాగని గురువుకి శిష్యుడి మీద కోపం ఉంటుంది అనుకోకూడదు. తనను మంచి మార్గంలో పెడుతున్నాడు. శిక్షించకపోతేనే ప్రమాదం. విచ్చలవిడితనం పెరుగుతుంది. సర్వనాశనం అవుతాడు.

అలాగే ప్రకృతికి లోబడి జీవులు బ్రతకాలి. మీరు ఏదో సహాయం చేద్దాం అనుకున్నారు. అది కష్టపడుతుంది అనుకుని మీరు సాయం చేయబోయారు. చివరికి చనిపోయింది. ఇదిగో దీన్ని చూడండి అని మరొక సీతాకోకచిలుక బయటికి రావడం చూపించాడు. రాజు గారు మళ్ళి దానిని బయటికి తీయడానికి వెళ్లబోతుంటే మంత్రి ఆపి, మహారాజా! ఎం జరుగుతుందో చూడండి అని అక్కడే నిలబెట్టేశాడు.

సీతాకోకచిలుక తన చుట్టూ ఉన్న వలయాన్ని చీల్చుకువచ్చి రివ్వున ఆకాశానికి ఎగిరింది. అప్పుడు మహారాజా! చూశారా! ఇది ప్రకృతి సహజంగా తనకు తానుగా పోరాడి బయటికి రావడం వలన తన ఇంద్రియాలలో బలం పెరిగింది. దానివలన దాని రెక్కలు పటిష్ఠమై ఎగరడానికి సహాయపడ్డాయి. ఇందాక మీరు అది ఎక్కడ కష్టపడుతుందో అని, కష్టపడకుండా సుఖపెట్టాలని వలయాన్ని చీల్చేసారు. దానివలన సీతకోకచిలుకకి కష్టపడాల్సిన పనిలేక బలం సరిపోక రెక్కలలో బలం చాలక ఎగరలేక చనిపోయింది.

అర్థమైందా మహారాజా! ప్రతిజీవికి పరమాత్మ స్వయం శక్తిని ఇచ్చాడు. దానిని ఎవరివారిని తెలుసుకోనివ్వాలి. అలాకాకుండా ఎక్కడ కష్టపడతారో అని ఆ జీవి కష్టం కూడా మనమే పడితే ఇదిగో అనవసరంగా నాశనం చేసినవారం అవుతాము.అని చెప్పగా మంత్రిగారికి కృతజ్ఞతలు తెలియజేసి సన్మానించి బహుమతులు ఇచ్చాడు. దీనిని ఆదర్శంగా తీసుకొని ఇంకొంత పరిపాలనకు వాడుకున్నాడు.

ఈ కథ ఇప్పటి తల్లిదండ్రులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. ఇలా పిల్లలపై ప్రేమ పిల్లల నాశనానికే తప్ప వికాసానికి దారితీయదు.

Leave a Reply