Posted [relativedate]
తమిళ తంబీలు తలెత్తుకు నిలబడ్డారు. ఇన్నాళ్లూ చిన్నమ్మకు వంగి వంగి దండాలు పెట్టిన నేతలంతా.. ఇప్పుడు ఎదురుతిరిగారు. దినకరన్ సహా శశికళను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా తిరుగులేని స్థాయి ఉన్న జయకు దండాలు పెడితే సహించిన తమిళ జనం.. దశాబ్దాల పాటు అనుభవం ఉన్న నాయకులు.. అంతఃపుర చెలికత్తె లాంటి శశి ముందు తలొంచుకు నిలబడటాన్ని సహించలేదు. అందుకే ఆమెపై తిరుగుబాటు చేసిన పన్నీర్ కు మద్దతు ఇచ్చారు. దీంతో పళనిస్వామి వర్గానికి తత్వం బోధపడింది.
రెండు గ్రూపుల కలయికకు ఆర్కేనగర్ ఉపఎన్నికే దోహదం చేసింది. రెండాకుల గుర్తుకోసం అడ్డదారులు తొక్కిన దినకరన్.. ఢిల్లీలో ఓ బ్రోకర్ కు 60 కోట్ల డీల్ కుదుర్చుకోవడం దుమారం రేపింది. ఢిల్లీ పోలీసులకు ఆధారాలు దొరకడంతో.. అన్నాడీఎంకే పరువు పోయింది. దీంతో దినకరన్ ను అర్జెంట్ గా వదిలించుకోవాలని సీఎం పళనిస్వామి సహా మంత్రులంతా ఓ నిర్ణయానికి వచ్చారు. ఇదే సమయంలో అటు పన్నీర్ నుంచి పార్టీ విలీన ప్రతిపాదన రావడం, అందుకు చిన్నమ్మను వెలేయాలని షరతు పెట్టడంతో.. ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
పన్నీర్ షరతుకు, శశి కుటుంబాన్ని బహిష్కరించాలన్న తమ నిర్ణయానికి సంబంధం లేదని మంత్రి జయకుమార్ ప్రకటించినా.. ఇక్కడ పన్నీర్ స్కెచ్ పక్కాగా వర్కవుట్ అయిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈసీ దగ్గర పెండింగ్ లో ఉన్న రెండాకుల గుర్తు విషయంలో కూడా పన్నీరే విజేతగా నిలుస్తారని సంకేతాలు అందడంతో.. పళనిస్వామి వర్గం దిగొచ్చింది. ఇంకా స్పష్టమైన విలీన ప్రకటన చేయకున్నా.. రెండాకులు కలిసిపోవడం ఖాయమనే అనుకోవాలి. పన్నీర్ కూడా పంతం నెగ్గించుకున్నట్లైంది.