‘ఏ లొసుగులూ లేకపోతే సీఎం ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయట్లేదు? సీబీఐ కేసులంటూ భయపడతారు.. దాచుకోడానికేమైనా ఉన్నాయా? ఏమీ లేనప్పుడు కేంద్రమంటే ఎందుకంత భయం?’ అని పరోక్షంగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో దుమారం చెలరేగుతోంది. తెలుగుదేశం ఎంపీలు ఒక్కొక్కరిగా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ పై నిప్పులుచెరుగుతున్నారు. చివరికి ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు సైతం పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆదివారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశంపై తాను ఎవరికీ భయపడటంలేదని, తిరుపతి సభలో పవన్ కల్యాణ్ అలా మాట్లాడటం సరికాదని అన్నారు. హోదాతోపాటు విభజన చట్టంలోని హామీలపై తాము రాజీలేని పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలోఉంచుకునే టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నదని చంద్రబాబు చెప్పారు. అనంతలో ఎండిపోతున్న వేరుశనగ పంటలను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.