Posted [relativedate]
తెలంగాణ సీఎం కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ప్రత్యర్థులు సైతం … కేసీఆర్ ఆయన నడిపించిన తెలంగాణ పోరును ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. అందుకే కేసీఆర్ కు ఇప్పుడు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. ఆంధ్రలోనూ ఆయనకు అభిమానులు పెరిగిపోతున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వచ్చి చేరినట్టు టాక్. ఎందుకంటే అసలు తెలంగాణ రావడం అసాధ్యం అన్న పరిస్థితి నుంచి ప్రత్యేకరాష్ట్రమే పరిష్కారం అన్న స్థితికి చేర్చిన క్రెడిట్ కేసీఆర్ దే. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఏపీలోనూ అప్లయ్ చేయాలని పవన్ ఆలోచిస్తున్నారట.
ప్రత్యేక హోదాపై ఇప్పుడు ఆశలు సన్నగిల్లాయి. అడపాదడపా మాట్లాడుతున్నది పవన్ కల్యాణ్ ఒక్కరే. అందుకే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు జనసేనాని ఇప్పుడు సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఆ దిశగా ఢిల్లీని మెప్పించేందుకు … తెలంగాణ తరహాలో ఉద్యమాన్ని నడిపించాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆ బాటలో నడిచే ముందు తగిన ఉత్సాహం కోసం కేసీఆర్ హిస్టరీని పరిశీలిస్తున్నారట పవన్.
తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటం, ఈ పయనంలో ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లు… వ్యూహ ప్రతివ్యూహాలు, గెలుపోటములు… ఇవన్నీ పవన్ కల్యాణ్ స్టడీ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎందుకంటే ఎన్ని డక్కామొక్కీలు, విమర్శలు ఎదురైనా .. కేసీఆర్ లక్ష్యం కోసమే పోరాడారు. యోధానుయోధులు చేయలేనిది చేసి చూపించారు. అందుకే తాను కూడా కేసీఆర్ బాటలో ఉద్యమాన్ని నడిపించాలని … ఆ పోరాట పంథాను బాగా పరిశీలిస్తున్నారట పవన్.
ఎలాగైనా కేసీఆర్ పంథాలో నడిచి ప్రత్యేక హోదాను సాధించడమే జనసేనాని మెయిన్ ఎజెండా అని టాక్. అయితే కేసీఆర్ ను ఫాలో అయినంత మాత్రాన ఆయనలా సక్సెస్ అవుతారా అన్నది కాలమే నిర్ణయించాలి.