Posted [relativedate]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పుడే 2019 ఎన్నికలపై కన్నేశారు. పార్టీ బలోపేతంపై ఆయన సీరియస్ గా దృష్టిపెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా యువతకు గాలమేసే పనిలో ఉన్నారు. 60 శాతం సీట్లను యూత్ కే ఇస్తానని ప్రకటించడం ద్వారా.. వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు తాను పోటీచేయబోయే స్థానాలను కూడా ముందే ప్రకటించాలని ఆలోచిస్తున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కో స్థానంలో పోటీ చేయాలని పవన్ స్టార్ భావిస్తున్నారని టాక్.
తెలంగాణలో జనసేనకు మంచి ఓటు బ్యాంకు దక్కాలంటే ముందు తాను రంగంలోకి దిగితేనే మంచిదని పవన్ అనుకుంటున్నారట. అందుకోసం కరువు జిల్లాగా పేరుపడ్డ మహబూబ్ నగర్ ను ఆయన ఎంచుకున్నారని టాక్. వచ్చే ఎలక్షన్ లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయాలని జనసేనాని నిర్ణయించుకున్నారన్న లీకులు వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ ఓ సర్వే కూడా చేయించుకున్నారట. సంస్థాగతంగా అక్కడ ఏ పార్టీ నుంచి కూడా బలమైన నాయకుడు లేడు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ పై వ్యతిరేకత చాలా ఉంది. కాబట్టి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా తన గెలుపు ఈజీ అని పవన్ భావిస్తున్నారట.
ఇక ఏపీ విషయానికొస్తే అనంతపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో అనంతపురంలో జరిగిన రైతు చైతన్య బహిరంగసభలో తాను ఎన్నికల్లో పోటీ చేస్తే.. అనంతపురంనుంచే బరిలోకి దిగుతానని ప్రకటించారు. కాబట్టి ఆయన అక్కడ్నుంచి పోటీ చేయడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.
తాను పోటీ చేసే స్థానాలను మొదటే ప్రకటించడం ద్వారా ఆయా జిల్లాల్లో జనసేన ఇమేజ్ ను ఆమాంతంగా పెంచేయాలన్నదే పవన్ వ్యూహమట. అటు మహబూబ్ నగర్ అయినా ఇటు అనంతపురం అయినా రెండూ వెనకబడ్డ ప్రాంతాలే. రెండు జిల్లాల్లోనూ అధికార పార్టీగా ఉన్నఅటు టీఆర్ఎస్ కు గానీ.. ఇటు టీడీపీకి గానీ సరైన ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి తన పార్టీకి మంచి ఫ్యూచర్ ఖాయమని జనసేనాని అంచనా. అంతేకాదు రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులను ముందే ప్రకటించే యోచనలో ఉన్నారట. ఫలితంగా పార్టీ అభ్యర్థులకు తగిన సమయం ఉంటుంది. ఇతర ప్రధాన పార్టీలకు దీటుగా జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఇంత పక్కాగా ప్రిపేర్ అవుతున్న పవన్ కల్యాణ్ … తన స్ట్రాటజీతో ఎన్నికల్లో ఎంత మేర సక్సెస్ అవుతారో తేలాలంటే 2019 వరకు వెయిట్ చేయక తప్పదు!!