Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నోట 2018 చివరిలో ఎన్నికలు రావొచ్చన్న మాట వచ్చిన మరసటి రోజే జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ స్పందించారు.ముందస్తు ఎన్నికలు వచ్చినా యుద్ధానికి సిద్ధమేనని సమరభేరి మోగించారు.ఔను నిజమే పవన్ కళ్యాణ్ కి వున్న క్రేజ్,అభిమానుల సంఖ్యని బట్టి చూస్తే ఇప్పటి లెక్కల ప్రకారం 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టడం,ఎన్నికల్లో పాల్గోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.కానీ ఆయన ఎన్నికలకు వెళుతోంది ఓ పవర్ స్టార్ గా కాదు. జనసేన అనే పార్టీ అధినేతగా..ఆ పార్టీ రథసారధిగా.ఆ విధంగా చూసుకుంటే ఎన్నికల యుద్ధానికి వెళ్లాలంటే జనసేన ని సన్నద్ధం చేయాల్సి ఉంటుంది.అలా సంసిద్ధం కాకుండా పార్టీలోకి వచ్చే నాయకులతో ఎన్నికలకు వెళితే ఏమవుతుందో ప్రజారాజ్యం అనుభవం చెప్పకనే చెప్పింది.
2019 ఎన్నికలు జనసేనకు,పవన్ కళ్యాణ్ కి ఓ పరీక్ష అనుకుంటే …తొలిసారి కాబట్టి జరిగేది ప్రిలిమ్స్ అనుకుంటే పొరపాటే.గ్రూప్స్ కి లక్షల మంది విద్యార్థులు పోటీ పడతారు.కానీ నిజంగా పరీక్ష కోసం చదివి,ఉద్యోగం వస్తుందని నమ్మకంతో పరీక్షకు వెళ్ళేవాళ్ళు బహు తక్కువ.వారు దాదాపు 10 ,15 శాతమే.మిగిలిన వారిలో జరిగేది ప్రిలిమ్స్ కాబట్టి అంటే ఏ,బి,సి,డి ఆప్షన్స్ లో ఏదో ఒకటి పెట్టొచ్చులే అని వచ్చే వాళ్లే ఎక్కువ.అలా వచ్చినవారిలో రెండు,మూడు శాతం మంది అదృష్ట వశాత్తు మెయిన్స్ కి క్వాలిఫై అవుతారు.కానీ మెయిన్స్ లో కచ్చితంగా బొక్కబోర్లా పడతారు.ఎందుకంటే అక్కడ నిజంగా ప్రశ్నకి తగ్గ సమాధానం రాయాలి.నో ఆప్షన్స్.అందుకే అక్కడ అదృష్టం కొండెక్కుతుంది.నిజమైన సామర్ధ్యం ఎదురుగా నిలుస్తుంది.
ఇప్పుడు జనసేన 2019 ఎన్నికల్ని ప్రిలిమ్స్ లా చూస్తుందా,చిత్తశుద్ధి వున్న విద్యార్థిలా మెయిన్స్ కి ప్రిపేర్ అవుతుందా అన్నది చూడాలి.జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా పార్టీ వెళ్తున్న స్పీడ్ లో వెళితే ఎన్నికల టైం కి అందుకోవడం కష్టమే.స్పీడ్ పెరగాలి.నాయకుడు ఇంకా సమయం వెచ్చించాలి.అన్నిటికీ మించి ప్రజల మనస్సులో ఏముందో తెలుసుకుని అడుగులేయాలి. జస్ట్ ప్రిలిమ్స్ అటెంప్ట్ చేద్దామనుకుని కాకుండా మెయిన్స్ రాయడానికి సిద్ధం గా ఉండాలి. ముందస్తుగా సమరభేరి మోగించడం కన్నా యుద్ధం లో గెలవడం ముఖ్యం.