పవన్,లోకేష్ సరికొత్త రాజకీయం?

Posted November 11, 2016

pawan kalyan comment on ap ruling corruption nara lokesh reaction about pawan comment
టీడీపీ యువనేత లోకేష్ …జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ సరికొత్త రాజకీయం మొదలెట్టారు.రాజకీయ వైరాన్ని వ్యక్తిగత వైరంగా మార్చుకున్న రాష్ట్రాల్లో తమిళనాడుది మొదటి స్థానమైతే వై.ఎస్,చంద్రబాబు ముఖాముఖీ తలపడడం స్టార్ట్ అయ్యాక ఏపీ లో కూడా అదే సంస్కృతి చూస్తున్నాం. విమర్శలు, ప్రతివిమర్శలకు జనం కూడా అలవాటు పడిపోయారు.జగన్ రంగంలోకి వచ్చాక విమర్శల జోరు చెప్పులతో కొట్టుకునే భాష కూడా వచ్చి చేరింది.నాయకుడే అలా ఉంటే ఇక శిష్య గణం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా?ఈ ఒరవడిలో కొట్టుకుపోతున్న రాజకీయాల్లో పవన్,లోకేష్ సరికొత్త సంస్కృతికి తెర దీస్తున్నారు. అదేంటో చూద్దాం..

అనంత సభలో పవన్ కళ్యాణ్ ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు.అదే విధంగా ఏపీ లో అవినీతి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సహజంగా ఇలాంటి రాజకీయ విమర్శలకి పదునైన జవాబులు వస్తాయి.ప్రత్యర్థుల తప్పులు ఎత్తిచూపిస్తూ ఎదురు దాడి చేస్తారు.కానీ లోకేష్ మాత్రం భిన్నంగా స్పందించారు.పవన్ అభ్యంతరాలకు నేరుగా సమాధానమిచ్చారు.హోదా వచ్చే అవకాశం లేనందున ప్యాకేజ్ కి అంగీకరించినట్టు ఒప్పుకున్నారు.ఇక అవినీతి విషయంలో పవన్ సూచనల్ని పరిగణించి తప్పులుంటే సరిచేసుకుంటామన్నారు .ఇటీవల సీఎం చంద్రబాబు కూడా అవినీతి అంశంలో పార్టీ వర్గాల్ని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు.తద్వారా పవన్,లోకేష్ వ్యక్తిగత ప్రస్తావనలు లేకుండా మాట్లాడారు.దీంతో వారి అభిమానులు సైతం సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవడం మీద దృష్టి పెడతారు .సైద్ధాంతిక ప్రాతిపదికన రాజకీయ భావజాలాన్ని వ్యాప్తి చేసుకుంటారు.ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం..కాకుంటే పాత పద్ధతిలోనే ప్రత్యర్థులపై పంజా విసిరే జగన్ లాంటి నేతలు దీన్ని జీర్ణించుకుంటారా? కష్టమే ..అయితే జనం ఈ తరహా రాజకీయాలకి పచ్చ జెండా ఊపితే జగన్ అయినా మరెవరైనా మారక తప్పదు.

SHARE