Posted [relativedate]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ ఇటీవలే ‘కాటమరాయుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ వచ్చిన ‘కాటమరాయుడు’ తీవ్రంగా నిరాశ పర్చాడు. కాటమరాయుడుకు ముందు వచ్చిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ కూడా దారుణ పరాజయం పాలైంది. దాంతో ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంపైనే పవన్ ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకుని ఉన్నారు. త్రివిక్రమ్‌తో గతంలో వచ్చిన పవన్ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా కూడా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. అయితే ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాను కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయాలని పట్టుదలతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. త్రివిక్రమ్ ఇప్పటి వరకు ఏ సినిమా కూడా సంవత్సరానికి తగ్గకుండా తియ్యలేదు. అందుకే ఆయన ప్రతి సినిమా సక్సెస్ అయ్యింది. మరి ఈసారి మూడు నెలల్లో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే ఫలితం ఎలా ఉంటుందో అన్న ఆందోళన పవన్ ఫ్యాన్స్‌లో వ్యక్తం అవుతుంది. అయితే త్రివిక్రమ్ ఈ చిత్రం స్క్రిప్ట్ కోసం మూడు నెలలకు పైగా కూర్చున్నాడు.
ఆ సమయంలోనే పక్కా ప్లాన్ చేశాడు. అందుకే తక్కువ సమయంలోనే ఎలాంటి లోపం లేకుండా, క్వాలిటీలో తేడా రాకుండా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడనే నమ్మకం చిత్ర యూనిట్ సభ్యులు మరియు సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. పవన్‌కు జోడీగా ఈచిత్రంలో కీర్తి సురేష్ మరియు అను ఎమాన్యూల్‌లు నటిస్తున్నారు. ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.