పవన్,జగన్ లలో ఎర్రచొక్కా ఎవరేసుకుంటారు?

 Posted October 28, 2016

pawan kalyan jagan who are mixing cpi and cpm parties
జనసేన రాజకీయ రంగప్రవేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాటేమోగానీ..ప్రతిపక్షనేత,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది.ప్రస్తుతానికి క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్న చిత్రమిదే.ప్రతిపక్ష పాత్ర పోషణకి రెండు పార్టీలు పోటీబడుతున్న విషయం స్పష్టమౌతోంది.ఈ పరిణామం వల్ల రెండు పార్టీలకి జరిగే లాభనష్టాల బేరీజు మాటెలా వున్నా …అసలుకే ఎసరొచ్చిన పరిస్థితుల్లో కొనసాగుతున్న వామపక్షపార్టీలకి మాత్రం మేలు జరిగింది.దేశవ్యాప్తంగా ఎర్ర జెండా వెలిసిపోతుంటే వారికొచ్చిన లాభమేంటని భావిస్తున్నారా? తప్పకుండా వుంది.కాషాయం బలంగా ఉన్నంత కాలం ప్రత్యామ్న్యాయ శక్తులకు ఎర్ర రంగు అవసరం ఉంటుంది…అయితే అది లెఫ్ట్ పార్టీల వల్ల ఓట్లు కురుస్తాయని కాదు. కాషాయ వ్యతిరేక శక్తిగా గుర్తింపు తెచ్చుకోవడం ఎర్ర జెండా పక్కనుంటే సులభమైపోతుంది.

ఇది కనిపెట్టారు కనుకే జగన్, పవన్ 2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్ళడానికి ఉత్సాహం చూపుతున్నారు.ప్రజాసమస్యలపై పోరాటాల్లో లెఫ్ట్ ని కలుపుకెళ్ళడానికి జగన్ ఆది నుంచి ప్రయత్నిస్తున్నా ఆయనపై వున్న అవినీతి ముద్ర వల్ల అదంతగా ఫలించలేదు.సిపిఐ ఆయనకి దూరంగా ఉంటే,సిపిఎం దగ్గరకెళ్ళి దూరమైంది.కాలంతో పాటు అన్ని మారిపోతున్నాయి.ఇప్పుడు జగన్ విషయంలోనూ లెఫ్ట్ పార్టీలు అంత పట్టుదలగా లేవు …ఉండేంత శక్తీ వారికి లేదు.కానీ ఇంతలో పవన్ రాక మళ్లీ ఆ పార్టీలని సందిగ్ధంలో పడేసింది.అనంతపురం సభ ప్రాంగాణాసానికి తరిమెల నాగిరెడ్డి పేరు పెట్టి తమకు పవన్ ఆహ్వానం పలికాడని లెఫ్ట్ పార్టీలకి అర్ధమైంది.అయితే నిలకడ విషయంలో పవన్,అవినీతి విషయంలో జగన్ వైఖరి వాళ్ళని ముందడుగు వేయకుండా ఆపుతున్నాయి. అయితే అది తాత్కాలికమే …త్వరలో ఈ ఇద్దరిలో ఒకరు ఎర్ర చొక్కా వేసుకోవడం మాత్రం ఖాయం.

SHARE