జనసైన్యం కోసం పవన్ పరీక్ష ..

Posted March 28, 2017

Pawan Kalyan janasena party Call For Speakers Writers Analysts from anatapur
“జనసేన….అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు,ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు మాత్రమే పుట్టిన పార్టీ ” …తాను రూపకల్పన చేసిన పార్టీ గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరచూ చెప్పే మాట.అధికారం తమ అంతిమ లక్ష్యం కాదని చెప్పేందుకు జనసైన్యాన్ని తయారు చేసుకోవడంలోనూ పవన్ సరికొత్త పద్ధతులు పాటిస్తున్నారు.తాను ఎన్నికల బరిలోకి దిగదలిచిన అనంతపురం జిల్లా నుంచే ఈ సరికొత్త ప్రక్రియకి శ్రీకారం చుట్టబోతున్నారు.కార్యకర్తలు,నేతలని పక్క పార్టీ లో నుంచి తీసుకోవాలనే ఆలోచన పక్కనబెట్టింది.యువత నుంచి కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే ప్రయత్నం మొదలెట్టింది.ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నవారిని పార్టీ కి పనిచేసేలా వ్యూహరచన చేసింది.జనసేనలో కీలక వ్యక్తిగా పనిచేస్తున్న మాజీ జర్నలిస్ట్ హరి ప్రసాద్ సారధ్యంలో జనసైన్యాన్ని తయారు చేసేందుకు ఓ పరీక్ష నిర్వహిస్తోంది.

జనసేన కోసం పని చేయాలి అనుకునేవాళ్ళకి ..ముందుగా అనంతపురం జిల్లా నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని పార్టీ ఓ ప్రకటన ఇచ్చింది.ఈ నెల 28 అంటే నేటి నుంచి ఏప్రిల్ 4 దాకా ఆన్ లైన్ ద్వారా www . Janasena party .org /resource persons లింక్ ఓపెన్ చేసి దరఖాస్తు చేయొచ్చు.ఈ లింక్ ద్వారా స్పీకర్,కంటెంట్ రైటర్,అనలిస్ట్….ఈ మూడు విభాగాల్లో ఎవరికి దేనిపై ఆసక్తి ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు.స్పీకర్ గా అప్లై చేసేవాళ్ళకి స్థానిక ,రాష్ట్ర స్థాయి సమస్యలపై సాధికారికంగా మాట్లాడగలిగే సామర్ధ్యం ఉండాలి.కంటెంట్ రైటర్ గా దరఖాస్తు చేసేవాళ్ళకి అవే అంశాలపై బాగా రాయగలిగే శక్తి ఉండాలి.ఇక అనలిస్ట్ గా పని చేయాలి అనుకునేవాళ్ళకి పై అంశాలపై అవగాహనతోపాటు విశ్లేషణా సామర్ధ్యం ఉండాలి.ఈ మూడు విభాగాల్లో దరఖాస్తు చేసుకునేవాళ్ళని పరీక్షించడానికి హైదరాబాద్ నుంచి వచ్చే జనసేన కేంద్ర కార్యాలయ టీం వస్తుంది. వారు ఎంపిక చేసినవాళ్లు అధికారికంగా జనసైన్యంలో భాగం అవుతారు.ఏదేమైనా జనసైన్యం ఎంపికలో జనసేనాని వినూత్న పద్ధతి ఫాలో అవుతున్నారు.

SHARE