పవన్ సభ హిట్టా? ఫట్టా?

0
662

 pawan kalyan janasena party meeting hit భారీ అంచనాలతో వచ్చిన సినిమా.. పవన్ కళ్యాణ్ తిరుపతి సభ.. ఈ రెండూ ఒక్కటే.. అంచనాలని అందుకుంటే సినిమా హిట్.. లేదంటే ఫట్.. మరి పవన్ సభ ఏమైంది? ఎక్కడ చూసినా ఇదే చర్చ.. పవర్ స్టార్ మాటలకు ఒక్కొక్కరిది ఒక్కో భాష్యం.. కానీ ఒక్కటి మాత్రం నిజం. పవన్ వీరాభిమానులు సైతం తిరుపతి ప్రసంగంతో డీలాపడ్డారు . వారికి కావాల్సింది ఏదో మిస్ అయ్యింది. ఇక తటస్థులు వ్యతిరేకులు మాట చెప్పక్కర్లేదు. పవన్ సభ ఎందుకిలా అయ్యింది? ఆయన స్పీచ్ లో టైమింగ్ ఎందుకు మిస్ అయ్యింది? మాటలు ఎందుకు తడబడ్డాయి?

సినిమా.. సభ.. ఈ రెంటిలో ఏది సక్సెస్ కావాలన్నా మూడు ప్రాధమిక విషయాలు పాటించాలి.
1. చూసేవాడిని వినేవాడిని ఆశ్చర్యంలో ముంచెత్తే కొత్త విషయం అయినా చెప్పాలి.. లేదా
2. అందరికి బాగా తెలిసిన విషయాన్నే సరికొత్త కోణంలో పరిచయం చెయ్యాలి
3 పై రెండు విషయాలు సాధ్యం కాదు అనుకున్నప్పుడు చూసేవాడిని వాస్తవానికి దూరంగా తీసుకెళ్లాలి.. ఊహా ప్రపంచంలో ముంచాలి.. భావోద్వేగాల పరంపరలో కొట్టుకెళ్ళేలా చెయ్యాలి
ఈ మూడు దారుల్లో ఏదో ఒకటి ఎంచుకుంటే విజయ మనే గమ్యాన్ని చేరుకునే అవకాశాలెక్కువ. కానీ పవన్ తిరుపతి సభ, ప్రసంగం ఈ మూడు ప్రాధమిక విషయాలకు కట్టుబడలేకపోయింది. ఒక దారిలో మొదలైన నడక మరో దారిలోకి వెళ్ళింది. గమ్యాన్ని మరిచి తెలిసిన దారిలో అక్కడక్కడే నడిచింది. చివరకు నిట్టూర్పుగా మిగిలింది.

తిరుపతి సభలో పవన్ టార్గెట్ కేంద్ర ప్రభుత్వం.. తీసుకున్న సమస్య ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా. కానీ పవన్ 65 నిమిషాల ప్రసంగంలో అసలు లక్ష్యం మీద ఆయన మాట్లాడింది ఏమిటి? సమస్య, శత్రువు రెండూ కళ్ళ ముందున్నపుడు చెలరేగిపోవడమే..కానీ సమస్యకు మూలకారణమైన వారితో సామరస్యాన్ని పాటించారు. మోడీ ప్రస్తావన వచ్చినపుడు ఆయనకు సారీలు చెపుతూ హెచ్చరికలు చేయడం, విమర్శలు గుప్పించడం.. సగటు అభిమానికి రుచించదు. ఆ వెంటనే మోడీ మీద యుద్ధమెందుకు చేయడం లేదని అధికార టీడీపీని, ప్రతిపక్ష వైసీపీని ప్రశ్నించారు. నేను మాత్రం మోడీని నేరుగా హోదా అంశాన్ని అడగనని చెప్పారు. ఇవన్నీ ఎంత పొంతనలేని విషయాలు. పైగా కేవీపీ ప్రైవేట్ బిల్లుకు ముందు ఈ సభ జరిగిఉంటే,పవన్ ఈ ప్రసంగం చేసి ఉంటే టైమింగ్ అదిరిపోయేది.కానీ రాజ్యసభ ఎపిసోడ్ తర్వాత పార్లమెంట్ లో ఎంతోకొంత వేడి పుట్టింది.ఒక్క బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ తమ పాత్ర పోషించేశాయి.ఇప్పుడు అదే అంశం గురించి మాట్లాడుతుంటే సినిమా అయ్యాక స్క్రిప్ట్ వినిపించినట్టుంది. పవన్ స్పీచ్ టైమింగ్ లో తేడా వచ్చింది.

ఇక చంద్రబాబు విషయానికొచ్చేసరికి అదే మొహమాటం. ఓ వైపు పొగడ్తలు.. మరో వైపు తెగడ్తలు.. కుదరవు. యుద్ధానికి సిద్ధమైనపుడు ఏదో ఒకటి తేల్చుకోవాలి. కానీ అదే తేల్లేదు. పవన్ మనసులో ద్వైదీభావమే.. ఆయన మాటల్లోనూ కనిపించింది. అభిప్రాయంలో స్పష్టత లేక మాటలో తడబాటు వచ్చింది.

ఇక ఉద్యమ నిర్మాణం గురించి పవన్ మూడంచెల విధానం అని చెప్పారు. ఆ మూడు దశల్లో ఒక్క దశ అయినా భలే వ్యూహం అనిగానీ.. భలే పోరాటం అనిగానీ అనిపించిందా? అంతా మూస పధ్ధతి. జనసేనాని ఉండాల్సిన తీరు అదికాదు. ఉద్యమ ప్రకటన చేస్తే దాని గురించి కనీస చర్చ జరగాలి. కానీ పవన్ ఇలా కొత్తగా చేస్తాడంట అని ఓ కొత్త విషయాన్ని పోరాటపథంలో చేర్చలేకపోవడం ఓ వైఫల్యమే.

సరే ఇవన్నీ రాజకీయాలు, వ్యూహాత్మక ఎత్తుగడలు తెలిసినవారు చేసేపని. ఆవేశపరుడు, నిజాయితీపరుడు, ఓ మంచి నటుడు.. భావోద్వేగాల్ని బ్రహ్మాండంగా పండించగలడు. ఇవన్నీ పవన్ కి గురించి సర్వసాధారణంగా వినిపించే మాటలు. కనీసం ఆ ఇమేజ్ కి తగ్గట్టు మాట్లాడినా లాజిక్ విషయం వదిలిపెట్టి సభకి వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు అయినా సంతోషపడేవాళ్లు. తనకి ఏవైతే ప్లస్ అని జనం అనుకొంటున్నారో.. అందుకు తాను భిన్నమైన మనిషినని చెప్పడానికి పవన్ ప్రయత్నించారు. ఇది కూడా వ్యూహాత్మక తప్పిదమే..రాజకీయాల్లో జనానికి కావాల్సిందన్నా చెప్పాలి. లేదా మన చెప్పేదానికైనా జనాన్ని ఒప్పించాలి. ఈ రెంటి మధ్య నడిస్తే అటూఇటూ కాకుండా అవుతాం … ఇపుడు అదే అయింది.

ఇక అన్నిటికన్నా చిన్న విషయం.. కానీ అతి ముఖ్యవిషయం.. పవన్ ప్రసంగంలో ‘నేను’ ఈ మాట ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. లెక్కలేనన్ని సార్లు ఆయన ‘నేను’ అన్నమాట వాడారు. కానీ ఓ సమూహానికి దిశానిర్దేశం చేయదలుచుకున్నపుడు ఏం చేయాలి? నేను అన్నమాటే మర్చిపోయి మనం అన్నమాటే వాడాలి. ఇది జనం సైకాలజీ గురించి తెలిసిన వాళ్ళు అనుసరించే ప్రాధమిక మార్గం. అక్కడే తడబాటు, తొట్రుపాటు వున్నపుడు ఇక గమ్యం గురించి మాట్లాడటం అనవసరం.

ఈ విశ్లేషణ ముగించే ముందు వివేకానందుడు నాయకత్వ పటిమ గురించి చెప్పిన ఓ మాట గుర్తు చేస్తున్నా.. నాయకుడనే వాడు జనాన్ని తన వెనుక తిప్పుకోడు. వారితోపాటు నడుస్తాడు. పవన్ చేప్పినట్టు అయన రాజకీయ ప్రస్థానం సుధీర్గమైతే తిరుపతి సభ ఓచిన్న పొరపాటు అవుతుంది. దాన్ని దిద్దుకోకుండా అదే బ్రహ్మాండమైన పునాదిగా భావించి ముందడుగు వేస్తే మాత్రం.. ఆశాసౌధాలు.. ఆశాసౌధాలుగానే మిగిలిపోతాయి. ఇప్పుడు మీరే చెప్పండి.. పవన్ సభ హిట్టో.. ఫట్టో..

Leave a Reply