Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ పెద్ద ప్రయోగమే చేస్తున్నారు.ఇంతకు ముందెన్నడూ తెలుగు గడ్డ మీద లేని విధంగా ఆ పార్టీకి పని చేసే వాళ్ళని పరీక్షలు,ఇంటర్వ్యూ లు పెట్టి ఎంపిక చేస్తున్నారు. తెలుగు రాజకీయాల్లో ఇలాంటి పరిణామం ఇంతకు ముందెన్నడూ కనిపించలేదు.ఇప్పుడు కనిపిస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది.ఈ ప్రయోగం ఎటు దారి తీస్తుందో …అందులో ఎవరెవరు పాల్గొంటారో ఇంకా ఓ అంచనాకి రాలేని పరిస్థితి.జనసేన ఎంపిక చేసిన దళం నేటి రాజకీయాల్లో ఎలా నెట్టకొస్తుందన్నది నిజంగా ఆసక్తికరం.వీళ్ళు రాజకీయాల్లో స్టార్స్ లా మెరిసిపోతారా ? సమిధలుగా మిగిలిపోతారో కాలమే తేల్చాలి .అయితే అంతకన్నా ముందు అసలు జనసేన పరీక్ష లో పాల్గొంటున్నది ఎవరు అని పరిశీలిస్తే ..
జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్న అనంతపురం జిల్లాలో ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యింది.ఇందులో రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు బహు తక్కువ. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ.రాజకీయ కుటుంబాల నుంచి యువత జనసేన పిలుపుకి పెద్దగా స్పందించకపోవడం వెనుక ప్రజారాజ్యం అనుభవమే కారణం.ఆ వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంకో ప్రయోగం చేయడానికి సీమలోని రాజకీయ కుటుంబాలు అంత ఆసక్తిగా లేవు. అయితే సినిమాలు,రాజకీయాల మీద ఆసక్తి ఉండి అందుకు దారి కనిపించని యువత ఈ ప్రయోగంలో పెద్ద ఎత్తున పాలుపంచుకుంది.వీళ్ళకి ఆసక్తి వున్నా ….ఎంతోకొంత రాజకీయ జిజ్ఞాస వున్నా …ప్రజాసేవ చేయాలని సంకల్పం వున్నా …ఓ ప్రధాన అవరోధం ఉంది.అదే ..సమాజం వీరిని ఎంత వరకు ఆదరిస్తుందన్నది ? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానం బట్టే జనసేన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
ఇలాంటి సందర్భాల్లో మరీ ప్రతికూలంగా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు రాజకీయాలకు కొత్తవారిని,చదువుకున్నవారిని ఎంకరేజ్ చేశారు.వారిని జనం ఆదరించారు కూడా. కానీ జనం దగ్గరికి వెళ్లే ముందు అసలు జనసేన ఎంపిక ప్రక్రియ ఎలా వుందన్నది అంతకంటే ముఖ్యమైన వ్యవహారం. ఓ ఒరవడికి అలవాటు పడిన చోట కొత్త పద్ధతిని తీసుకురావడమంటే చిన్న విషయం కాదు.ఇప్పుడు జనసేన అంత పెద్ద బాధ్యత నెత్తిన పెట్టుకుంది.ఆ భారాన్ని మోసి జనసేన తీరాన్ని చేరుతుందా అనేది కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్న..లెట్ అజ్ వెయిట్ అండ్ సీ..