Posted [relativedate]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ చేయగానే పవన్ అభిమానులు ఎగిరి గంతేశారు… గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఘన విజయం సాధించడమే అందుకు కారణం. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తమ అభిమాన హీరో నటించనున్నాడు అనగానే… ఈ సినిమా కూడా హిట్ అయితీరుతుందని తెగ ఆనంద పడుతున్నారు. పవన్ ఖాతాలో మరో భారీ విజయం చేరినట్లేనని ఫిక్స్ అయిపోయారు. అయితే త్రివిక్రమ్ ఈ సినిమాలో పవన్ ని ఏ రోల్ లో చూపించబోతున్నాడు అనే విషయం మీద మాత్రం కాస్త టెక్షన్ పడుతున్నారు. తాజాగా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త వారి టెక్షన్ ని తగ్గించనుంది.
త్రివిక్రమ్ ఈ సినిమాలో పవన్ ను ఓ సాఫ్ట్ వేర్ కంపనీలో పని చేసే ఉద్యోగిగా చూపించబోతున్నాడట. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ ఏ.ఎస్.ప్రకాష్ తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా ఓ సాఫ్ట్ వేర్ కంపనీ సెట్ ను కూడా వేయిస్తున్నాడట దర్శకుడు. అలానే ఈ చిత్రానికి ‘దేవుడే దిగివచ్చినా’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న కాటమరాయుడు ఈ నెల 24న రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనుంది. అత్తారింటికి దారేది సినిమాతో అప్పట్లో టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన వీరి కాంబినేషన్ ఇప్పుడు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.