Posted [relativedate]
నిన్నమొన్నటిదాకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల్లో కనిపించిన సున్నితత్వం మాయమైంది.హోదా డిమాండ్ తో విశాఖలో ఆంధ్ర యువత తలపెట్టిన నిరసన మీద ఉక్కుపాదం మోపడంతో పవన్ బాగా హర్ట్ అయ్యారు.బలవంతంగా ఉద్యమాన్ని ఆపాలని చూస్తే…తెగించి పోరాడతామని పవన్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక పంపారు.ఉంటే ఉంటాం …పోతే పోతాం అనే దాకా వెళ్లారు.తనకు కుటుంబం,పిల్లలు వున్నా ప్రజలకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.ప్రజల కోసం సొంత అన్నతోనే విభేదించిన తాను బీజేపీ,టీడీపీ లను ప్రత్యేక హోదా విషయంలో వదిలేది లేదని పవన్ సంకేతాలిచ్చారు.
విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీకి ఓ గంటైనా అనుమతి ఇస్తే బాగుండేదని పవన్ అభిప్రాయపడ్డారు. పోలీస్ నిర్బంధంతో ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయించగలిగినా ఉద్యమ ఉద్ధృతిని ఆపలేరని ఆయన ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.ఎన్నికల ముందు బీజేపీ,టీడీపీ లకి మద్దతు ఇచ్చినపుడు తనకు రాజకీయ అనుభవం లేకపోయినా బాగానే తీసుకున్నారని …ఇప్పుడు హోదా గురించి అడిగితే తనకు అనుభవం లేదంటున్నారని ఆయన ఆవేదన చెందారు. భయపెట్టి పాలిస్తామంటే కుదరదని ….పోలీసులతో కాకుండా పాలసీ లతో పాలన సాగించాలని ఆయన సర్కార్ కి చురకలు వేశారు.
ఆనాడు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు ఇప్పుడు హోదా సంజీవని కాదని చెప్పడాన్ని పవన్ తప్పుబట్టారు.నోట్ల రద్దుపై 5 రకాలుగా బాబు మాట్లాడారని పవన్ ఎగతాళి చేశారు.సుజనా చౌదరి,రాయపాటి లాంటి వాళ్ళని పక్కనబెట్టుకుని అయన మాట్లాడుతున్నారని పవన్ విమర్శించారు.ఎన్నికల ముందు హోదా ఇస్తామన్న బీజేపీ తర్వాత ఒంటెత్తు పోకడలతో ప్రజాభిప్రాయాన్ని కాలరాచి అవకాశవాద రాజకీయాలకి పాల్పడుతోందని పవన్ ఆరోపించారు.ఏపీ లో టీడీపీ మినీ బీజేపీ లా తయారైందని పవన్ ధ్వజమెత్తారు.