పవన్‌, త్రివిక్రమ్‌ల ‘పరదేశీ ప్రయాణం’

Posted April 17, 2017

pawan kalyan trivikram movie title paradesi prayanam
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తాజాగా ‘కాటమరాయుడు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్స్‌ను రాబట్టలేక పోయినా కూడా పవన్‌ ప్రస్తుతం నటిస్తున్న త్రివిక్రమ్‌ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పవన్‌ ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కనిపించనున్నాడు. మొదట దీనికి ‘దేవుడే దిగి వచ్చిన’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

పవన్‌, త్రివిక్రమ్‌ల సినిమాకు కొత్త టైటిల్‌ ఒకటి ప్రస్తుతం సోషల్‌ చక్కర్లు కొడుతుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు ‘అత్తారింటికి దారేది’ అనే విభిన్న టైటిల్‌తో సినిమా వచ్చింది. అది సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఇప్పుడు ‘పరదేశీ ప్రయాణం’ అనే విభిన్న టైటిల్‌ను త్రివిక్రమ్‌ ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ టైటిల్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

SHARE