Posted [relativedate]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద ఎందరో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఆ ఆశలకు ఊపిరులూదుతూ అయన జనసేన స్థాపించారు.అయితే ఇప్పటిదాకా ఓ రాజకీయ పార్టీగా జనసేన నడక …ఓ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రస్థానం చూసాక అభిమానుల ఆశలు ఆవిరవుతున్నాయి. సభసభకి పవన్ లో పరిణితి వస్తోందని అనిపిస్తున్నా ….సభసభకి మధ్య గడువు పెరిగిపోతోంది. దీంతో పవన్ పార్ట్ టైం రాజకీయనేతగానే మిగిలిపోతున్నారు.జనాల్లో,అభిమానుల్లో వున్న అభిమానాన్ని ఓ శక్తిగా మార్చాల్సిన నాయకుడే వారిని నీరు కారుస్తున్నాడు.ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే ట్విట్టర్ మాధ్యమం ద్వారా ఐదు అంశాలపై పవన్ తాజాగా ప్రశ్నస్త్రాలు సంధించారు. గోవులకి సంబంధించి బీజేపీ వైఖరిని పవన్ నిలదీశారు.గోవుల్ని రక్షించాలనుకుంటే వాటినెందుకు దత్తత తీసుకోవడం లేదని అడిగారు.గోవుల చర్మ ఉత్పత్తులపై నిషేధం ఎందుకు విధించలేదని కూడా బీజేపీ ని ప్రశ్నించారు.
ఇక రెండో రోజు ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్య అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ ని వ్యతిరేకించిన రోహిత్ మీద ఆ పార్టీ వ్యక్తిగత విద్వేషాన్ని ప్రదర్శించిందని …అన్ని పార్టీలు దీన్ని తమ రాజకీయ అస్త్రంగా వాడుకున్నాయని …విశ్వవిద్యాలయాలు చదువు కన్నా రాజకీయ పోరాటాలకు వేదికలవుతున్నాయని పవన్ అభిప్రాయపడ్డారు. నిజానికి గోవుల అంశంలో లేదా రోహిత్ విషయంలో పవన్ సమంజసంగానే మాట్లాడారు.కానీ ఈ రెండు సమస్యలపై అయన తన వంతు సూచనలు చేయలేకపోయారు. ఓ పార్టీగా జన సేన వైఖరిని స్పష్టం చేయలేకపోయారు.సామాజిక సమస్యలపై ఓ విశ్లేషకుడిలా మాత్రమే అయన స్పందించినట్టుంది. లేదా ఓ జర్నలిస్ట్ సామాజిక సమస్యపై రాసిన ఆర్టికల్ ని గుర్తుకు తెస్తోంది. ఓ నాయకుడు రెచ్చగొట్టే పద్ధతిలో వ్యవహరించడం సమంజసం కాదని అయన ఎన్నో సార్లు చెప్పారు.అదే సమయంలో ఓ నాయకుడు సామాజిక సమస్యలకి పరిష్కారం చూపాల్సి ఉంటుందని మర్చిపోతే ఎలా ? పవన్ మీ నుంచి జనం ముఖ్యంగా మీ అభిమానులు ఓ నాయకుడిని చూడాలని ఆశిస్తున్నారు గానీ ఓ విశ్లేషకుడిని కాదు .ఆ పనికి ఎంతో మంది అందుబాటులో వున్నారు. కానీ వారిలో ఒక్కరైనా నాయకుడిగా ఎదగడం అంత తేలిగ్గాదు. అలాంటి అవకాశమున్న మీరు ఓ మెట్టు పైకి ఎక్కాలి గానీ దిగితే ఎలా ? పవన్ ధోరణి మారకపోతే అయన నిజమైన నాయకుడిగా కాక ఓ విశ్లేషకుడిగా మాత్రమే మిగులుతారు.