Posted [relativedate]

ఈశాన్యరాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్ రాజకీయాలు మరోసారి వార్తల్లోకెక్కాయి. ఏకంగా అధికార పార్టీ ముఖ్యమంత్రికి షాక్ తగిలింది. ఒక్కరోజులో అతని సీటు గల్లంతయిపోయింది. అధికార ప్రాంతీయ పార్టీ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్(పీపీపీ).. తమ ముఖ్యమంత్రి పెమాఖండూ, డిప్యూటీ సీఎంతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలను పార్టీనుంచి సస్పెండ్ చేసింది. క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారంటూ వేటు వేసింది.
ఖండూ ఇక ఎంతమాత్రమూ శాసనసభాపక్ష నేత కాదని, అతనికి ఇక ఏ అధికారాలూ ఉండబోవని పార్టీ అధ్యక్షుడు కహఫా బెంజియా ప్రకటించారు. పార్టీ సభ్యులెవరూ ఆయన నిర్వహించే సమావేశాలకు హాజరుకావొద్దని నేతలను హెచ్చరించారు కహఫా బెంజియా. దీన్ని ఉల్లఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడబోమన్నారు. త్వరలో కొత్త శాసనసభాపక్ష నేతగా ఖండూ స్థానంలో మరో నేత తకమ్ పరియోను ఎన్నుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సభాపతి, గవర్నర్లకు ఈ విషయంపై ఇప్పటికే అధికార పార్టీ నుంచి సమాచారం పంపించారట.
ఇలా అరుణాచల్ ముఖ్యమంత్రి మారిపోవడం ఈ మధ్య కాలంలో ఇది రెండోసారి. సెప్టెంబర్‌లో పెమా ఖండూతో పాటు మరో 42 మంది కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు.. పీపీఏను స్థాపించారు. వీరికి మరికొందరు ఇతర ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేశారు. ఇందులో బీజేపీ భాగస్వామిగా ఉంది. అందరి మద్దతుతో ఖండూ సీఎం అయ్యారు. కానీ అది ఎక్కువకాలం సాగలేదు. చివరకు ఖండూ కూడా సీఎం పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఖండూ మాత్రం ఇప్పటికీ తనకే మెజార్టీ ఎమ్మెల్యేల ఉందని చెబుతున్నారు. దీంతో అరుణాచల్ రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.!!