పని అక్కడ ఉండేది ఇక్కడ…. ఖాకీలకు తిప్పలు

0
413

police stay problems

కృష్ణపుష్కరాలను పురస్కరించుకుని విధులు నిర్వహించడానికి వచ్చిన వివిధ జిల్లాలకు చెందిన పోలీసులకు విధులు ఒకచోట…విడిది ఒకచోట…అన్న చందంగా నగర పోలీసులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పోలీసు అధికారులకు రూట్ మ్యాప్‌లు చేతులో పెట్టారే కాని వారికి సరైన మార్గదర్శకం చూపించే మార్గదర్శకులే కరువయ్యారు. గట్టెనక ప్రాంతంలో భవానీపురం, విద్యాధరపురం, ఊర్మిళానగర్, జోజినగర్, కబేళా సెంటర్, లేబర్‌కాలనీ, సితారసెంటర్, స్వాతి సెంటర్ తదితర ప్రాంతాలను కలుపుతూ వున్న రోడ్డు మ్యాప్‌ను పోలీసు అధికారులకు అందించారు. ఆ మ్యాప్ కూడా సమగ్రంగా లేదు.

కబేళా సెంటర్‌లోని చనుమోలు వెంకట్రావు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి వచ్చే వాహనాలు జోజినగర్, సితారసెంటర్ అలాగే ఊర్మిళానగర్ ప్రాంతాలకు మళ్ళించాల్సి వుంది. నైనవరం గేటు సమీపంలోని వైవిరావ్ ఎస్టేట్‌లో శాటిలైట్ బస్‌స్టేషన్ ఏర్పాటవుతుంది. అలాగే ఎస్టేట్‌లో పుష్కరనగర్ నిర్మాణం శరవేగంగా సాగుతుంది. నూజివీడు, మైలవరం తదితర ప్రాంతాల నుండి వచ్చే వాహనాలన్నీ ఈ పుష్కరనగరం వద్దే వాహనాలు పార్కింగ్ చెయ్యాలి, అక్కడ నుండి యాత్రికులు, పుష్కరఘాట్లకు చేరుకోవాల్సివుంది. ఈ పుష్కరఘాట్లకు దగ్గరదారేది? అలాగే ఏ సందు గొందుల్లో గుండా చేరాలి అనే అంశాలను యాత్రికులకు సూచించడానికి బయట నుంచి వచ్చిన పోలీసు అధికారులకు అవగాహన వుండదని చెప్పవచ్చు.

ఇలాంటి సమయంలో విధులు నిర్వహణలో వున్నటువంటి ఇతర ప్రాంతాల అధికారులకు స్థానిక ట్రాఫిక్ సిఐలకు సమన్వయం కుదిర్చితే మార్గం సుగమం అవుతుంది. పైగా అధికారులు విడిదికి, విధి నిర్వహణ ప్రాంతానికి సుమారు 4, 5కిలోమీటర్లు వుండటం విధులకు ఆటంకమే కలుగుతుంది. గొల్లపూడి ప్రాంతంలో వై జంక్షన్ (మైలరాయి సెంటర్) ప్రాంతంలో ముగ్గురు డీఎస్పీలు విధులు నిర్వహించాల్సివుంది. భవానీపురం కరకట్ట ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి స్నానఘాట్లు అలాగే గొల్లపూడి ప్రాంతంలో నిర్మిస్తున్న స్నానఘాట్లకు ఈ అధికారులు పర్యవేక్షించాల్సివుంది. ఇప్పటికైనా అధికారులు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో అక్కడే వసతి కల్పిస్తే సమయా భావం కలగకుండా విధులు ఆటంకం లేకుండా హాజరయ్యే అవకాశం వుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

వెస్ట్‌జోన్ పరిధిలో ఇబ్రహీం పట్నం, తుమ్మలపాలెం, గుంటుపల్లి, సూరాయపాలెం, నల్లకుంట, గొల్లపూడి, భవానీపురం తదితర ప్రాంతాలలో మొత్తం 16 పుష్కరనగర్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో వచ్చే యాత్రి కులు, భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురౌవకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాల్సివుంది. గోదావరి పుష్కరాల్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలోపెట్టుకుని కృష్ణాపుష్కరాలులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురవకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పోలీసులు, రెవెన్యూ, కార్పొరేషన్, ఇరిగేషన్ తదితర శాఖలు సిద్ధంగా వున్నారు.

Leave a Reply