జాతీయ అవార్డులు.. రాజకీయ రచ్చ

Posted April 9, 2017

political war for film awardsజాతీయ అవార్డులు మరోసారి వివాదాస్పదం అయ్యాయి. గత ఏడాది సగం సినిమాగా రిలీజైన బాహుబలికి ఉత్తమచిత్రం అవార్డు ఇవ్వడం వెనుక రకరకాల రాజకీయ కారణాలు ఉన్నాయని మీడియా దుమ్మెత్తిపోసింది. అయినా సరే ఈసారి కూడా షరా మామూలుగా అస్మదీయులకే కమిటీ మెంబర్లులు అవార్డులిచ్చారని బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అవార్డుల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ప్రియదర్శన్ పై ఆరోపణల వర్షం కురుస్తోంది. తనకు అయినవాళ్లకి, స్నేహితులకు అవార్డులు ఇప్పించుకున్నారని, నిజమైన ప్రతిభ గల వారిని విస్మరించారనేది విమర్శకుల వాదన.

అమీర్ ఖాన్ నటించిన దంగల్ ను పక్కనపెట్టి.. రుస్తుంలో నటనకు అక్షయ్ కు అవార్డు దక్కడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. రుస్తుం దేశభక్తి నేపథ్యంలోనే తీసినా.. అది అంతగా ఆడలేదు. నటనా పరంగా కూడా దంగల్ లో అమీర్ తో పోలిస్తే.. అక్షయ్ తేలిపోయాడనే వాదన ఉంది. అలాంటప్పుడు అమీర్ ను పక్కనపెట్టి.. అక్షయ్ కు ఉత్తమ నటుడు ఇవార్డు ఇవ్వడం వెనుక.. ప్రియదర్శన్ హస్తం ఉందని ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ రూమర్లు మార్మోగుతున్నాయి. అటు అక్షయ్ కూడా విమర్శలతో ఇబ్బందిపడుతున్నారు. దీంతో డబ్బులిచ్చి అవార్డు కొనుక్కోలేదని ప్రకటించాల్సి వచ్చింది.

ఇక మరో వివాదాస్పద అవార్డు మోహన్ లాల్ ది. ఆయన కంప్లీట్ యాక్టర్ అని అందరికీ తెలుసని, కానీ ఈ ఏడాదే అవార్డు రావడం వెనుక కూడా ప్రియదర్శనే ఉన్నాడని సినీ లోకం కోడై కూస్తోంది. అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ పలు చిత్రాలు కలిసి చేశారు. విజయవంతమైన జంటగా పేరు తెచ్చుకున్నారు. ఇక మోహన్ లాల్ తో ప్రియదర్శన్ కు ఎప్పట్నుంచో స్నేహం ఉంది. అందుకే వీరిద్దరికీ అవార్డులు వచ్చేలా ప్రియదర్శన్ కథ నడిపించాడని అంటున్నారు. ప్రతిసారీ ఇలాంటి వివాదం కామనే అయినా.. ప్రియదర్శన్ కారణంగా మంచి సినిమా తీసిన అక్షయ్ కు, మచ్చలేని నటుడు మోహన్ లాల్ కు విమర్శలు తప్పడం లేదంటున్నారు వారి అభిమానులు.

SHARE