బాహుబలి తర్వాత ప్రభాస్ జర్నీ..

0
902

 prabhas movies after releasing bahubali 2బాహుబలి.. భారత చలనచిత్ర ప్రయాణం లో ఓ మైలు రాయి. ఈ సినిమాలో భాగస్వాములైన వారందరికీ డబ్బు,కీర్తి,బాగానే వచ్చి పడ్డాయి. అయితే అందుకు వాళ్ళు చెల్లించిన మూల్యం సామాన్యమైంది కాదు.. అపారమైన కష్టం.. అంతక మించి విలువైన సమయం.. దాదాపు నాలుగేళ్లు .. ప్రాంతీయ చిత్ర పరిశ్రమలో ఓ కథానాయకుడు ఒక సినిమా కోసం ఇంత సమయం వెచ్చించడం అంత తేలిక కాదు.. కానీ ప్రభాస్ ఆ సాహసం చేశాడు, అందుకు తగ్గ ఫలితం చూశాడు.. దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది కానీ ఓ మైలు రాయి చేరుకున్నాక ప్రయాణం అంత తేలిక కాదు.. భారీ విజయం తర్వాత అంచనాలు అందుకోవటం కత్తి మీద సామే..

తెలుగు సినీ చరిత్రలో ఇలాంటి ఇబ్బందులు ఎన్నోసార్లు ఎందరో హీరోలు ఎదుర్కొన్నారు.. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా సంచలనాలు సృష్టించిన తర్వాత కృష్ణ నటించిన పదికి పైగా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి..’పాడిపంటలు’ సినిమా వచ్చాక గానీ మళ్లీ బండి పట్టాలెక్కలేదు.. ఇక తెలుగు సినిమా శైలిని మార్చేసిన ‘శివ’ చిత్రం తరువాత నాగార్జునకు సుదీర్ఘ కాలం పాటు హిట్ దక్కలేదు.. ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ తో మళ్లీ హిట్ ఆయన్ను పలకరించింది. సింహాద్రి విజయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు మళ్లీ హిట్ రావటానికి ఎన్నేళ్ళు పట్టిందో చూశాం. రాజమౌళి రంగంలోకి దిగితేగాని యమదొంగ లాంటి హిట్ దక్కలేదు.ఈ మూడు అనుభవాలు చూశాక బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ ఏంటనే సందేహాలు సహజం..

అయితే గత అనుభవాలు చూసి అవే పరిస్థితులు ఎదురవుతాయి అని అనుకోలేము..ఎందుకంటే కాలం మారింది.. తెలుగు సినిమా పోకడ మారింది.. ఓ స్టార్ హీరో మాస్ హీరోకు ఎంత ఆదరణ లభిస్తుందో.. ఓ చిన్న హీరో ప్రయోగాత్మక చిత్రాలకు అదే తరహా ప్రోత్సహం ఇస్తున్నారు ప్రేక్షకులు.. ఇటీవల వచ్చిన భలే భలే మగాడివోయ్, క్షణం, జెంటిల్ మన్, బిచ్చగాడు,మజ్ను,పెళ్లిచూపులు ,ఎం.ఎస్ .ధోని  వంటి సినిమాలు ఇందుకు ఉదాహరణలు.. హీరో, సినిమా.. ఇలాగే ఉండాలి అనే చట్రంలోంచి నిర్మాతలు,దర్శకులు బయట పడ్డారో లేదో గానీ.. ప్రేక్షకులు ఆ చిత్రం నుంచి బయటపడ్డారనడానికి ఇటీవల బాక్సాఫీస్ చరిత్ర చూస్తే చాలు..

Prabhas-Sujeeth.. editprabhas2. cop

ఈ పరిస్థితులు ప్రభాస్ కు ఊతం ఇస్తాయనడంలో సందేహం లేదు. ఓ సినిమా కోసం పెళ్లి కూడా వాయిదా వేసుకున్న ఈ స్టార్ హీరో.. తదుపరి ప్రయాణానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాడు.. రన్ రాజా రన్ అంటూ తొలి సినిమాతోనే తనదైన మార్క్ చూపించిన సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడు. ఇందులో ఆయన ఖాకీ దుస్తుల్లో మెరిసిపోతాడని టాలీవుడ్ టాక్.. ఆ తర్వాత సినిమాకి కూడా ప్రయత్నాలు ముమ్మరం గానే సాగుతున్నాయి.

‘జిల్’ తో యూవీ క్రియేషన్స్ పరిచయం చేసిన డైరెక్టర్ రాధాకృష్ణ ఆ సినిమాకు దర్శకత్వం వహించ వచ్చట.. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ.. షూటింగ్ కూడా పూర్తిగా విదేశాల్లో జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. ఎనీవే బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రయాణం సాపీగా,సజావుగా సాగాలని ఆశిద్దాం..! ఆల్ ది బెస్ట్ ప్రభాస్..

*కిరణ్ కుమార్

Leave a Reply