ప్రకాశం బ్యారేజీ కి జలకళ ..

  prakasam barrage water
ప్రకాశం బ్యారేజి వద్ద జలకళ సంతరించుకుంది. ఏడాది పొడవునా 12 అడుగుల నీటి మట్టంతో కళకళలాడుతూ ఉండాల్సిన ప్రకాశం బ్యారేజి దగ్గర నీటి మట్టం ఇటీవల రెండడుగులకు పరిమితమైపోయింది. పట్టిసీమనుంచి గోదారి జలాలను తరలించాక మట్టం కాస్త పెరిగినా, అవి కృష్ణా జలాలు కావన్న నిస్పృహ భక్తుల్లో గూడుకట్టుకుందనే విషయం నిజం. అయితే మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న పుష్కరాలకు పుష్కలంగా కృష్ణానది నీళ్లే రాబోతున్నాయి.

పులిచింతల జలాశయంలో ముందు జాగ్రత్తగా నిల్వచేసి ఉంచిన 2.7 టిఎంసిల నీటి నుంచి గత రెండు రోజులుగా తొమ్మిదివేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డు ఐదు టిఎంసిల నీటిని విడుదల చేసేందుకు అంగీకరించింది. నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా ప్రస్తుతం మూడు, నాలుగువేల క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేయటం ప్రారంభమైంది.

మునేరు నుంచి బ్యారేజీకి వచ్చి చేరుతున్న 1600 క్యూసెక్కుల నీటిని నేరుగా పంట కాలువలకు విడుదల చేస్తున్నారు. ఇదిలావుండగా పోలవరం కాలువకు గండి పూడ్చే పనులు పూర్తికావటంతో పట్టిసీమ వద్దనున్న మొత్తం 24 మోటార్లలో ప్రస్తుతం ఒక దాని వెంట మరొకటిగా ఇప్పటికి రెండు మోటార్లు ద్వారా మూడువేల క్యూసెక్కుల నీటిని వదలటం ప్రారంభించగా గురువారం తెల్లవారుఝాముకి ఆ నీరు చేరుకోగలదని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం బ్యారేజీ నీటి మట్టం ఆరు అడుగులకు చేరుకుంది. పుష్కరాల ప్రారంభం నాటికి అటు పులిచింతల, ఇటు పట్టిసీమ నుంచి భారీగా నీటిని విడుదల చేసి ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల సహజ నీటిమట్టాన్ని కొనసాగించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్యారేజీ దిగువ దుర్గాఘాట్, పద్మావతి ఘాట్‌లకు బ్యారేజీ నుంచి నీరు విడుదల చేస్తున్నారు

SHARE