Wednesday, December 8, 2021
Homelatestప్రసాద్ మల్టీప్లెక్స్.. పది కోట్లు ఎగ్గొట్టిందా?

ప్రసాద్ మల్టీప్లెక్స్.. పది కోట్లు ఎగ్గొట్టిందా?

హైదరాబాద్ నగరానికే ప్రత్యేక ఆకర్షణ ప్రసాద్ మల్టీప్లెక్స్. తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ సంస్కృతికి శ్రీకారం చుట్టిందే ప్రసాద్స్. ఐతే ఆ సంస్థకు స్థలం కేటాయించే విషయంలో నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలున్నాయి. ఆ సంగతలా వదిలేస్తే.. ప్రసాద్స్ సంస్థ ప్రభుత్వానికి పదేళ్లుగా పన్ను ఎగ్గొడుతోందని.. ఆ సంస్థ నుంచి ప్రభుత్వానికి రూ.10 కోట్ల దాకా రావాల్సి ఉందని తాజాగా వెల్లడైన సమాచారం సంచలనం రేపుతోంది.

ఇటీవల ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఎగవేతకు పాల్పడుతున్న సంస్థలపై తెలంగాణ పర్యాటక..సాంస్కృతిక శాఖ ఓ కన్నేసింది. ఈ క్రమంలోనే 2008 నుంచి ఇప్పటివరకు ప్రసాద్స్ సంస్థ రూ.10 కోట్ల దాకా పన్ను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే బకాయిలను చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవని ఐమాక్స్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం.

చంద్రబాబు సర్కారు అధికారంలో ఉండగా 2000 సంవత్సరంలో జరిగిన ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఐమాక్స్ ఉన్న స్థలాన్ని 33 ఏళ్లకు లీజుకిచ్చారు. నెలకు రూ.12 లక్షల లీజుతో పాటు మొత్తం మల్టీప్లెక్స్కు వచ్చే నికర ఆదాయంలో 15 శాతాన్ని ప్రతినెలా చెల్లించేందుకు ఆ సంస్థ అంగీకరించింది. ఒప్పందం ప్రకారం లీజు చెల్లిస్తున్న సంస్థ.. ఆదాయంలో 15 శాతం ప్రభుత్వానికి చెల్లిస్తోంది కానీ.. అందులో పన్నుల్ని మినహాయిస్తోంది.ఐతే తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని ఐమాక్స్ యాజమాన్యం అంటోందట. కానీ ప్రభుత్వం అందుకు అంగీకరించట్లేదు. మరి ఈ వివాదం చివరికి ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

- Advertisment -
spot_img

Most Popular