Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పీకే అన్న వెంటనే గుర్తుకు వచ్చేది అమీర్ ఖానే. అయితే తెలుగు రాజకీయాల్లో మాత్రం ఇప్పటివరకూ పీకే అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణే. కానీ కొత్తగా మరో పీకే వచ్చారు. ఆయనే ప్రశాంత్ కిషోర్. ఇంతకీ కొత్త పీకే ఎవరో గుర్తుకు వచ్చిందా? 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ.. అమిత్ షా అండ్ కోకు రాజకీయ వ్యూహాల్ని సెట్ చేయటమే కాదు.. భారీ మెజార్టీతో విజయదుందుబి మోగించటంలో కీ రోల్ ప్లే చేశారు. అనంతరం.. బీహార్ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయన.. మోడీ అండ్ కోకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వటం తెలిసిందే. తర్వాతి కాలంలో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయన.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పని చేశారు.
అయితే..గతంలో మాదిరి ప్రశాంత్ కిషోర్ తన మేజిక్ ను యూపీలో ప్రదర్శించలేకపోయారు. మోడీ.. అమిత్ షా వ్యూహరచన ముందు ప్రశాంత్ కిషోర్ తేలిపోయారు. ఆ మాటకు వస్తే..యూపీలో కాంగ్రెస్ బలం అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో.. ఆయన ఐడియాలజీ అంతగా వర్క్ వుట్ కాలేదని చెప్పాలి. ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన ఏపీ రాజకీయాల మీద దృష్టి పెట్టటం తెలిసిందే. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ఆయన వ్యవహరించనున్నట్లు చెబుతున్నారు.
2019 కానీ.. అంతకుముందే కానీ ఎన్నికలు జరిగిన పక్షంలో.. జగన్ ను అధికారపీఠంలో కూర్చోబెట్టేందుకు అవసరమైన రాజకీయ వ్యూహాల్ని ఆయన సమకూర్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన డీల్ ఇప్పటికే జరిగినట్లుగా తెలుస్తోంది. అసలే ఏపీలో వైసీపీ వ్యూహాల పరంగా నానాటికీ తీసికట్టుగా మారుతోంది. కనీసం ప్లాన్లు అరవు తెచ్చుకునైనా బాబుపై పైచేయి సాధించాలని జగన్ తాపత్రయపడుతున్నారు. కానీ యూపీలో బీజేపీకి బలమైన ప్రాంతీయ నేత లేకపోయినా పీకే వ్యూహాలు పనిచేయలేదు. అలాంటిది ఏపీలో 30 ఏళ్లుగా పాతుకుపోయిన చంద్రబాబు ముందు ఏం పనిచేస్తాయని సెటైర్లు పడుతున్నాయి.