Posted [relativedate]
వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు నో సీఎం.. నో ఎలక్షన్ అనే మాటను జపిస్తున్నారట. కొంతకాలం వరకు ఈ రెండు మాటలే ఆయన నోటి వెంట వచ్చేవి. మాటెత్తితే త్వరలో ఎన్నికలొచ్చేస్తాయ్.. నేనే సీఎం అంటూ బీరాలు పలికే వారు. కానీ ఒక వ్యక్తి ఇచ్చిన సలహాతో ఇప్పుడా మాటను వాడొద్దని జగన్ నిర్ణయించుకున్నారని టాక్.
జగన్ ఇప్పటికే అనధికారికంగా ప్రశాంత్ కిశోర్ సలహాలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. తనదైన వ్యూహాలతో జాతీయ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్న ఈ రాజకీయ సలహాదారు.. ఇప్పుడు వైసీపీకి సలహాలు ఇస్తున్నారట. అందులో భాగంగానే జగన్ కు కూడా కొన్ని సలహాలు ఇచ్చారని టాక్.
వైసీపీ అధినేత గురించి ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే అన్నీ ఆరా తీశారట. జగన్ మాటతీరు… పార్టీ నేతలతో ఆయన ఇంటరాక్షన్ ఎలా ఉంది? ఆయన గురించి జనం ఏమనుకుంటున్నారు? జిల్లాల వారీగా వైసీపీ బలాబలాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ సర్వే చేయించారట. ఆ సర్వేలో జగన్ నడవడికపై కొన్ని స్పష్టమైన అభిప్రాయలొచ్చాయట. దాని ప్రకారం వైసీపీ అధినేత తన మాటతీరును ముందు మార్చుకోవాలని ప్రశాంత్ కిశోర్ … ఆయనకు సలహా ఇచ్చారట.
మాటిమాటికి ఎన్నికలొచ్చేస్తాయ్… నేనే సీఎం అనే మాటలు రిపీట్ చేయొద్దని ప్రశాంత్ కిశోర్ జగన్ తో చెప్పారట. కొంతకాలం వరకు అస్సలు ఆ మాటలే వాడొద్దని చెప్పారట. అంతేకాదు పార్టీ పరిస్థితి కోస్తాంధ్రలో అస్సలు బాగా లేదని కూడా లెక్కలతో సహా వివరించారని టాక్. అర్జెంటుగా అక్కడ పార్టీని రిపేర్ చేయాలని సూచించారని సమాచారం. అటు టీడీపీ ఇప్పటికే దూకుడు పెంచింది.. ఇటు జనసేన దూసుకొస్తోంది. ఈ పరిస్థితుల్లో వ్యూహం మార్చితే తప్ప లాభం లేదని ప్రశాంత్ గట్టిగానే చెప్పారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ కిశోర్ మాటలు వాస్తవానికి దగ్గర ఉండడంతో జగన్ కూడా ఆలోచనలో పడ్డారట. అందుకే ఇక సీఎం అవుతానంటూ మాటలు చెప్పడం ఆపేయాలని నిర్ణయించుకున్నారని టాక్. అంతేకాదు ఇక పార్టీని బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించారట. మరి మాటల వరకు ఓకే గానీ.. ఇప్పటికైనా జగన్ మేల్కొంటారా? ప్రశాంత్ కిశోర్ సలహాలు పాటించి పార్టీ బలోపేతంపై దృష్టి పెడతారా? చూడాలి.