Posted [relativedate]
ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశ రాజకీయాలనే షేక్ చేసింది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఈ నిర్నయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే మోడీ ప్రధాని అయ్యింది మొదలు… ఆయన టైమ్ నడుస్తోంది ఏ పార్టీ కూడా పెద్దగా ఆయన్ను కార్నర్ చేయలేదు. కానీ ఇప్పుడు నోట్ల రద్దు అంశంపై దేశంలోని పలు పార్టీలకు అందివచ్చిన అవకాశంగా మారింది. దీన్ని అస్త్రంగా చేసుకొని మోడీపై దాడి చేయడానికి పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. ఆ స్థాయిలో మోడీ కార్నర్ చేయాలంటే… మోడీ అంత స్ట్రేచర్ ఉన్న నాయకులే అయి ఉండాలి. అందులో కాంగ్రెస్ ను పక్కనబెడితే… అలాంటి నాయకులు దేశంలో అతికొద్ది మందే ఉన్నారు.
మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, జయలలిత, నితీశ్ కుమార్, చంద్రబాబు, కేసీఆర్…ఇలా అతి కొద్దిమందే మోడీ అంత కాకపోయినా.. కాస్త పాపులర్ నాయకులే. పైగా వీరంతా ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న వారే. వీరిలో చంద్రబాబు, కేసీఆర్…. మోడీని ప్రస్తుత పరిస్థితుల్లో విమర్శించట్లేదు. ఇక ముందు కూడా విమర్శించకపోవచ్చు. ఇక మిగిలిన వారిలో జయలలిత ఆస్పత్రిలో ఉన్నారు కాబట్టి ఆమె నుంచి ఎలాంటి వాగ్బాణాలు లేవు. నితీశ్ కుమార్ నోట్ల రద్దుపై పాజిటివ్ గాఉన్నారు. నలుగురు పోను ప్రస్తుతం మోడీని ఓ రేంజ్ లో విమర్శిస్తున్న నాయకులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాలే. వీరిద్దరూ టుది పాయింట్ మాట్లాడతారు. అనవసరమైన విషయాల్లోనూ పెద్దగా ఎప్పుడూ జోక్యం చేసుకోరు. అందుకే వీరిద్దరూ ఏది మాట్లాడినా అది మీడియాకు హాట్ న్యూస్. అలాంటి వీరిద్దరూ ఒక్కచోట చేరితే ఇంకేముంది.. నోట్ల రద్దు అంశం ఇప్పుడు వీరిద్దరిని ఏకంగా చేసింది. అవసరమైతే జట్టు కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ ఇద్దరూ. అరవింద్ కేజ్రీవాల్ … దీదీతో టచ్ లోనే ఉన్నారట.
ముఖ్యంగా మోడీపై విమర్శలు చేయడంలో అవసరమైన సలహాలు, సూచనలు ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారట. మోడీపై విమర్శలు చేయడంతో అటు ప్రజల్లోనూ.. ఇటు నేషనల్ మీడియాలోనూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇక మమతాబెనర్జీ అయితే ప్రధాని మోడీపై విమర్శల జడివానను మరింత పెంచారు. మోడీని రాజకీయాల్లోనే లేకుండా చేస్తానని ప్రతినబూనారు. ఇవన్నీ చూస్తుంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల నుంచి మోడీకి పెద్ద ముప్పే పొంచి ఉందంటున్నారు పరిశీలకులు.