ఖమ్మం జిల్లాలో కాల్వలో పడ్డ బస్సు ..9 మంది మృతి …..

   private bus fall nagarjuna sagar canal khammam districtఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద  అర్థరాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ మియాపూర్‌ నుంచి సూర్యపేట, ఖమ్మం మీదుగా రాజమండ్రి వయా కాకినాడకు వెళుతున్న ప్రైవేటుబస్సు నాయకన్‌ గూడెం వద్ద నాగార్జున సాగర్‌  కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 9 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయాలయ్యాయి. బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అతివేగంతో వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు నాయకన్‌ గూడెం రోడ్డు మలుపు వద్ద ఒక్కసారిగా కాల్వలోకి దూసుకెళ్లింది.సమాచారం అందుకున్న రెస్క్యూ  టీం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కాల్వలో నాలుగు అడుగుల మేర నీళ్లు ఉండటంతో 2 క్రేన్‌ల సహాయంతో బస్సును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మూడు 108 వాహనాలలో 18 మంది క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బస్సు 30 అడుగుల పైనుంచి పడిపోవడంతో 8 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతిచెందారు. నీళ్లల్లో మునిగి ఉన్న బస్సులో మరో 3 మృతదేహాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

అధికారులు , పోలీసులు సహయక చర్యలు చేపట్టారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో క్షతగాత్రులను బయటకు తీస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎస్సీ షానావాజ్‌ ఖాసీం, డీఎస్పీ సురేశ్‌కుమార్‌ ఘటనాస్థలిలో సహాయ చర్యలను పరిశీలిస్తున్నారు. ఖమ్మం జిల్లా బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. జిల్లా అధికారును సమాచారం అడిగి తెలుసుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అవసరమైన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అదించాలని సీఎం ఆదేశించారు.

SHARE