Posted [relativedate]
కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా రాహుల్ గాంధీ కీలక పదవిలో ఉన్నా… ఇప్పటికీ ఆయన గాడిలో పడడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అందరూ ఇక యువరాణి ప్రియాంకపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆమె రాకతోనే పార్టీకి పునరుజ్జీవం వస్తుందని ఆశిస్తున్నారు. ప్రియాంకకు రాజకీయాలు కొత్త కాకపోయినప్పటికీ ఇప్పటిదాకా ఆమె కేవలం ప్రచారానికే పరిమితమయ్యారు. ఏదో ఎన్నికలప్పుడు వచ్చి వెళ్లడం తప్ప ఆ తర్వాత ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించరు. అయితే ఈసారి ఎస్పీతో పొత్తుపై అనుమానాలు ఏర్పడిన తరుణంలో యువరాణి మంత్రాంగం ఫలించింది. ఆమె ఏం చేశారో కానీ.. మొత్తానికి అఖిలేశ్ ను ఒప్పించారు. ఫలితంగా ఇప్పుడు ఎస్పీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో పార్టీలో ప్రియాంక ఇమేజ్ మరింత బలపడింది. రాజకీయాల్లో ఆమె రాకకు ఇదే సరైన తరుణమని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
ప్రస్తుతానికి యూపీ ఎన్నికల్లో ప్రియాంక కేవలం క్యాంపెయిన్ కే పరిమితమవుతారని టాక్. యూపీ పోల్ తర్వాత పార్టీలో ఆమె మరింత యాక్టివ్ కావాలని భావిస్తున్నారట. కొందరైతే యూపీ ఎన్నికల తర్వాత ఆమెకు కీలక బాధ్యతలు ఇస్తారని చెబుతున్నారు. రాజ్యసభ నుంచి ఎంపీ సీటిచ్చి … రాహుల్ కు సమానంగా వైస్ ప్రెసిడెంట్ లాంటి హోదా ఏదైనా ఇచ్చే అవకాశం ఉందట. ఇప్పటికే రాహుల్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి ప్రియాంకకు వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా సానుకూలంగా ఉన్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.