ఆ యాప్ తో పుష్కర భక్తులకు రక్షణ ..

 pushkara app safty devotion people
కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు సవాళ్లు, సమస్యలను ఎదుర్కొనేలా పుష్కర భక్తులకు ప్రభుత్వం యాప్ ద్వారా సాయం అందించేందుకు సిద్ధమైంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కర ప్రయాణం సాగేందుకు, ఆపదలో చిక్కుకున్నా తక్షణసాయం అందించేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డీజీపీ, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. ఈ యాప్‌ను పుష్కరాలకే పరిమితం చేయకుండా ఆ తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ రహదారి ప్రమాదాలపై అప్రమత్తం చేసేలా రూపొందిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చేందుకు రోడ్డు, రైలుమార్గాలు కలిపి తొమ్మిది ప్రధాన దారులున్నాయి. గుంటూరు, హైదరాబాద్, ఏలూరు వైపు నుంచి వచ్చే రైళ్లు, రోడ్డు మార్గంలో కీసర, మైలవరం, నాగార్జున వర్సిటీ పాయింట్లలో ఆయా మార్గాల నుంచి నూజివీడు, మచిలీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాల్లో ఎంతమంది ప్రయాణికులున్నారన్న వివరాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో క్రోడీకరిస్తారు. కమాండ్ కంట్రోల్‌రూంలో డ్యాష్‌బోర్డుకు సమాచారం చేరుతుంది. విజయవాడలో ప్రస్తుతం ఎన్ని వాహనాలున్నాయి? భక్తులు ఎంతమంది? అనే విశ్లేషణ ఉంటుందని, రద్దీ నియంత్రణకు ఇది సహకరించనుంది.

వాహనాలు, భక్తుల రద్దీ సమాచారంతోపాటు నగరంమొత్తంగా లేదంటే ఒక మార్గంలో, ఒక ప్రాంతంలో ఎంతుందన్న వివరాలనూ గంటగంటకు తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఆప్షన్ ద్వారా శాటిలైట్ బస్‌స్టేషన్ నుంచి ఘాట్లకు, ఘాట్ల నుంచి బస్‌స్టేషన్‌కు సిటీబస్సు ఎప్పుడు వస్తుంది? ప్రస్తుతం ఎంత దూరంలో ఉంది? ఎన్ని నిమిషాలకు ఏ బస్సుంది వివరాలు వస్తాయి. సిబ్బంది ప్రవర్తన ఎలా ఉందో కూడా సమాచారాన్నీ ఇవ్వొచ్చు. ప్రమాదం ఆప్షన్‌పై క్లిక్ కొడితే ప్రమాద సమాచారం కమాండ్ కంట్రోల్‌రూంకు చేరుతుంది. సహాయబృందాలు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. తరచూ ప్రమాదాల జరిగే ప్రాంతాలపై ముందే అప్రమ్తతం చేసే వ్యవస్థ ఉంది. రెండు, మూడు కిలోమీటర్ల తరువాత గడిచిన నెలరోజుల్లో రెండు ప్రమాదాలు జరిగాయి.. జాగ్రత్తగా వెళ్లండంటూ ఫోన్‌కు సమాచారమూ వస్తుంది.

పుష్కరాలు ఆప్షన్ ద్వారా దగ్గరలో ఏయే ఘాట్లున్నాయి? ఎంతదూరం? సదుపాయాలేంఉన్నాయి? ఎలాచేరుకోవచ్చు వంటివి ఉన్నాయి. మహిళల రక్షణ ఆప్షన్‌లో ఆపదలో మీట నొక్కితే కుటుంబసభ్యులు, సమీప పోలీస్‌స్టేషన్, కమాండ్ కంట్రోల్‌రూంకు సమాచారం చేరుతుంది. పౌర భాగస్వామ్యం ఆప్షన్ ద్వారా చోరీ జరిగినా, అనుమానించదగిన వస్తువులు ఏమైనా ఉన్నా ఫొటోలు, వీడియోలు, ఎస్ఎంఎస్‌ల రూపంలో పోలీసులకు సమాచారం అందించవచ్చు. దగ్గరలో పోలీస్‌స్టేషన్ ఆప్షన్‌తో దగ్గరలో పోలీస్‌స్టేషన్ ఎక్కడుంది? ఎలా వెళ్లాలన్న వివరాలతో పాటు ఫోన్‌నెంబర్లు ఉంటాయి

SHARE