పుష్కరాలు భళా.. బాబు హ్యాపీ

  pushkaraalu super chandrababu happyవిజయవాడలో కృష్ణా పుష్కరాలు అద్భుతంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరి, కృష్ణా నదుల్ని అనుసంధానం చేయగలిగామన్నారు. నీటి భద్రతకు అందరూ సంకల్పం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. కేవలం విజయవాడలోనే 8 లక్షల మంది భక్తులు పుష్కర పుణ్యస్నానమాచరించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పుష్కర ఘాట్లలో సుమారు 21 లక్షల మంది భక్తులు పుణ్యస్నానమాచరించారని ఆయన తెలిపారు. నదుల అనుసంధానం వల్ల అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయని ఆయన చెప్పారు.

పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం మొదలు పెట్టిన తాము, ఈసారి కృష్ణా నదిని పెన్నా నదితో అనుసంధానం చేయనున్నామని తెలిపారు. పుష్కర స్నానాలు ఒక మతానికి సంబంధించిన కార్యక్రమం కాదని ఆయన చెప్పారు. ప్రతి ఒక్క మతానికి, ప్రతి కులానికి చెందినదని ఆయన చెప్పారు. అందుకే నదీమతల్లికి అందరూ అనుసంధానం కావాలని ఆయన సూచించారు. సౌకర్యాలపై భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, నిన్న మూడు జిల్లాల నుంచి 201 ఫిర్యాదులు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. భక్తులు సహకరించాలని, ఏ సమస్య ఏర్పడినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎవరైనా తన ట్విట్టర్ ఖాతాకు సమస్యల గురించి ఫిర్యాదు చేస్తే, వాటిని సాధ్యమైనంత త్వరగా, ప్రాధాన్యతా పూర్వకంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఆదివారం సెలవుదినం కావడంతో పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. దీనితో ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. విజయవాడలో పేరొందిన దుర్గాఘాట్ కు భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు చేస్తూ తరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేస్తోంది. పోలీసులు పలు నిబంధనలు సడలించింది. అమ్మవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమవుతున్నారు.

SHARE