రియో ఒలింపిక్స్ లో పతకంపై ఆశలు పెంచుతోంది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. మహిళల బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు చేరింది. లండన్ రజత పతక విజేత, ప్రపంచ నెం.2 షట్లర్ వాంగ్ యిహన్(చైనా)పై 22-20, 21-19 తేడాతో వరుస సెట్లలో గెలుపొందింది. గురువారం జరిగే సెమీస్‌లో సింధు జపాన్‌కు చెందిన షట్లర్‌తో తలపడనుంది.హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సింధు చాలా చాకచక్య ఆటతీరును ప్రదర్శించింది. రెండు సెట్లలోనూ భారత షట్లర్ అనవసర తప్పులు చేయలేదు. డ్రాప్ షాట్లతో చైనా ప్లేయర్‌ను వత్తిడికి గురిచేసింది.
షాట్ల ఎంపికలో సింధు ప్రదర్శించిన నైపుణ్యం డ్రాగన్ క్రీడాకారిణిని ఇరకాటంలో పడేసింది. చాలా సందర్భాల్లో ఇద్దరూ పెద్దపెద్ద ర్యాలీలు ఆడాల్సి వచ్చింది. ప్రతి పాయింట్‌ను ఖాతాలో వేసుకునేందుకు సింధు కఠినంగా శ్రమించింది. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ పవర్ గేమ్‌ను కూడా ప్రదర్శించారు. అవసరమైనప్పుడే సింధు తన స్ట్రోక్ ప్లేతో చైనా షట్లర్‌ను ఖంగుతినిపించింది. తొలి గేమ్‌ను నెమ్మదిగా స్టార్ట్ చేసిన సింధు మధ్యలో తన జోరును పెంచింది. చైనా షట్లర్‌తో ఉన్న స్కోర్ తేడాను తగ్గించేందుకు సింధు తన గేమ్‌లో స్పీడ్‌ను అమాంతంగా రెట్టింపు చేసింది. ఓ దశలో వాంగ్ 11-8 స్కోర్‌తో ముందంలో ఉంది.
అయితే ఆ టైమ్‌లో దూకుడు ప్రదర్శించిన సింధు స్కోర్‌ను 12-11కు చేర్చింది. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టుగా పోరాడారు. ఓ దశలో గేమ్ 13-13 స్కోర్‌తో రసవత్తరంగా మారింది. లాంగ్ డిస్టెన్స్ షాట్లతో చైనా ప్లేయర్‌ను బేస్ లైన్ వైపుగా మళ్లించింది సింధు. మధ్యమధ్యలో డ్రాప్ షాట్లతోనూ వాంగ్‌ను నెట్ వద్దకు వచ్చేలా చేసింది. వాంగ్ చేసిన కొన్ని పొరపాట్లను తెలివిగా వాడుకున్న సింధు తొలి గేమ్‌ను 22-20 స్కోర్‌తో సొంతం చేసుకుంది.