సింధు … నవ జీవన సింధువు …

0
567

 pv sindhu speech after taking silver medalసింధు … సింధు … సింధు … దేశమంతా ఇదే మాట. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల దాకా అదే బాట. ఒలింపిక్స్ లో ఆమె తెచ్చిన రజతం. అంతటా వినిపిస్తున్న ఆ నామజపం… దేశాన్ని ఊపేస్తున్న జోరు … సింధువంత హోరు … ఇదంతా చూస్తుంటే తమిళనాట రజని సినిమా రిలీజ్ రోజు, తొలి ఆట ఇంట్రడక్షన్ చూసినట్టుంది. అక్కడ రజని కనపడతాడు గానీ అభిమానుల హోరులో ఆయన మాట వినపడదు. ఇప్పుడు కూడా సింధు రజతాన్ని ప్రతి ఒక్కరు తామే తెచ్చినంత సంబరపడుతున్నారు. ఈ సందర్భాన్ని ఓ పండగలా చేసుకుంటున్నారు. అయితే సింధు ఒలింపిక్స్ రజతంతో పాటు ఫైనల్లో ఓటమి తర్వాత ఆమె చెప్పిన మాటలపై కూడా దృష్టి పెట్టండి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దం లోంచి చూసి, ప్రతి విషయాన్నీ జీవన్మరణ సమస్యగా భావిస్తున్న వారికి … సింధు మాటలు జాగ్రత్తగా వినండి… అవి నేటి తరానికి ఆణిముత్యాలు… 21 ఏళ్ల సింధు … జీవన సింధువు దాటేందుకు చూపిన మార్గాలు.

రియోలో ఫైనల్ పోరు ముగిశాక … రజతం ఖరారయ్యాక సింధును ఇదే విషయం గురించి ప్రశ్నిస్తే ఏమందో తెలుసా? ఒలింపిక్స్ కి నేను పతకం గెలవాలన్న లక్ష్యం తో వచ్చా. రజతం సాధించినందుకు సంతోషం… ఈ వారం అంతా బాగా ఆడినందుకు గర్వంగా వుంది… ఇవీ సింధు పలుకులు. నిత్య అసంతృప్తి రగిలిపోయే జీవులారా ఈ మాటలు వినండి. 100 కి 90 మార్కులు వచ్చినా మిగిలిన 10 మార్కులను గురించే ఆలోచించే నిరాశా వాదులారా మేల్కొనండి. జీవితమంటే ఫై మెట్టు ఎక్కడమే కాదు … అక్కడి దాకా నడవడం. ఆ నడకని హాయిగా ఆస్వాదించడం కూడా.

ఫైనల్ పోరాటం గురించి సింధు విశ్లేషణ ఇది.

‘ఒలింపిక్స్ ఫైనల్లో ఆడటం గొప్ప అనుభవం. ఇద్దరం బాగా ఆడాం. అయినా ఎవరో ఒకరు గెలవాలి కదా. నాకన్నా ప్రత్యర్థి మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. ఒక సెట్ ఓడిపోయాక కూడా మారిన్ అనూహ్యంగా పుంజుకొంది. ఆమెకు నా అభినందనలు’… శభాష్ సింధు… ఓటమిని ఇంత హుందాగా తీసుకోవడం కూడా ఓ గెలుపే… నిర్ణయాత్మక సందర్భాన్ని ఎదుర్కోవడం కూడా ఓ గెలుపే… ప్రత్యర్థి గొప్పతనాన్ని గుర్తించడం సైతం ఓ గెలుపే… బరిలో ప్రత్యర్థితో తలపడుతూ కూడా బయటినుంచి ఆ పోరును ఆస్వాదించే నిర్మలత్వం వల్లే సింధు ఆలా మాట్లాడగలిగింది. సమస్యలో ఇరుకొన్నపుడు అక్కడినుంచి గాక దాని వెలుపలినుంచి విషయాన్ని అర్థంచేసుకుంటే.. పరిష్కారాన్ని కనుక్కుంటే ఎంతో ప్రశాంతత… మనశాంతి … అదే కరువైన జనులారా సింధును స్ఫూర్తిగా తీసుకోండి…

మారిన్ అదుపుల గురించి ప్రశ్నించినపుడు సింధు నిజాయితీగా ఇచ్చిన సమాధానం ఇది!. ఆమె ఆలా అరుస్తుందని ముందే తెలుసు… మ్యాచ్ లో ఇలాంటివి మాములే… నేను కొన్ని సార్లు అరిచా కదా ! … ఓటమికి సాకులు వెదికే మహానుభావులకు సింధు మాటలు పాఠం కాదా? గెలవడానికి అర్హత సాధించాలంటే ఓటమిని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా వుండాలి. సింధు మాటల్లో ఆ ధైర్యం వుంది. భవిష్యత్ తప్పకుండ ఆమెదవుతుంది. నేటి రజతం రేపటి స్వర్ణమవుతుంది.

సింధు గెలుపు హోరులో ఆమె చెప్పిన ఆణిముత్యాల్లాంటి మాటలు వినిపించకుండా పోకూడదన్న ఉద్దేశమే ‘తెలుగు బుల్లెట్.కామ్’ చేసిన ఈ చిన్న ప్రయత్నం.

Leave a Reply