Posted [relativedate]
రియో ఒలింపిక్స్ లో రజతంతో మెరిసిన తెలుగుతేజం పీవీ సింధు… ఇప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారిగా సేవలందించనుంది. ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన సందర్భంగా గతంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆమెకు గ్రూప్-1 పోస్టు ఇస్తామని ప్రకటించాయి. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఆమెకు డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఆఫర్ చేసింది. అందుకు పీవీ సింధు కూడా అంగీకరించింది. అయితే డిప్యూటీ కలెక్టర్ గా సేవలందించడం ఓకే కానీ… ఇప్పుడు ఆట మాటేంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
డిప్యూటీ కలెక్టర్ గా సేవలందించడం అంటే మాటలు కాదు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలి. అయితే సింధు మాత్రం బ్యాడ్మింటన్ గేమ్ తో ఎప్పుడూ బిజీ. అదీగాక ఇప్పుడు ఆమె కెరీర్ లో మంచి పీక్ స్జేజ్ లో ఉంది. ఒలింపిక్స్ తర్వాత కూడా విజయాలు సాధించి ఊపు మీద ఉంది. అలాంటి సింధు డిప్యూటీ కలెక్టర్ గా సేవలు అందించాలంటే… బ్యాడ్మింటన్ కు దూరం కాక తప్పదు. మరి సింధు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయబోతుందన్నదే ఆసక్తికర అంశం.
ఏపీ ఉన్నతాధికారుల మాటలను బట్టి చూస్తే.. ఒకవేళ సింధు డిప్యూటీ కలెక్టర్ గా జాయిన్ అయితే.. ఆమె బ్యాడ్మింటన్ కు స్వస్తి పలకక తప్పదు. ఎందుకంటే ఏపీలో అధికారులకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందులో డిప్యూటీ కలెక్టర్ కు బాధ్యతలు మరీ ఎక్కువ. కాబట్టి ఆమె ఇక గేమ్ కు దూరం కావాల్సిందేనని వారి వాదన.
మరోవైపు సింధు సన్నిహితులు చెబుతున్న ప్రకారం చూస్తే… ఆమె రెండింటిని బ్యాలెన్స్ చేసేందుకే మొగ్గు చూపుతోందని టాక్. డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూనే… కేవలం పెద్ద పెద్ద టోర్నీలకే ఆడాలని సింధు నిర్ణయించుకుందట. అంతేకాదు ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తూనే… రోజూ ప్రాక్టీస్ కూడా చేయబోతుందట.
ఏపీతో పోల్చితే తెలంగాణలో అధికారులపై పని ఒత్తిడి తక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ జిల్లాల సంఖ్య పెరిగింది. మరి తెలంగాణను కాకుండా సింధు… ఏపీని ఎంచుకోవడానికి కారణం… ఏపీలో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకుందట. క్రీడాకారులు ప్రభుత్వ విధులను నిర్వహించలేరు.. అన్నమాటను తప్పు అని రుజువు చేయడానికే ఈ నిర్ణయం తీసుకుందని టాక్. ఒలింపిక్స్ లాగే… డిప్యూటీ కలెక్టర్ పోస్టులోనూ ఆమె సత్తా చాటాలని కోరుకుందాం… ఆల్ ది బెస్ట్ సింధు!!!!!