ఆత్మ విశ్వాసం ‘సింధు’వంత …

0
543

 pv sindhu want self confidence ఒక 21 ఏళ్ళ అమ్మాయి ప్రపంచ వేదికపై అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తూంటే యావద్దేశం కన్నార్పకుండా చూసింది. న్యూస్ ఛానెళ్ళు అన్ని ప్రసారాలూ ఆపేసి ఈ మ్యాచ్ నే ప్రసారం చేశాయి. లక్షల మంది టీవీలకు అతుక్కుపోయారు. అంతగా దేశాన్ని రగిల్చింది పూసర్ల వెంకట సింధు.. తెలుగు తేజం.మొదటి సెట్ హోరాహోరీగా సాగింది. దాదాపుగా ఇద్దరూ చెరో పాయింటూ సాధించుకుంటూ చివరి దాకా వెళ్ళారు. ఆఖరిలో సింధూ వేసిన పవర్ ఫుల్ షాట్ ను ఒకుహరా తిప్పికొట్టలేకపోయింది.

మొదటి సెట్ లో చాలా తక్కువ మార్జిన్లో అంటే 21-19 తేడాతో ఓడిపోయింది జపనీస్ స్టార్ ప్లేయర్.తొలి సెట్ జరిగిన తీరును చూశాక రెండో సెట్ కూడా అదే రీతిలో నువ్వా నేనా అన్న రీతిలో ఉంటుందని అంతా ఆశించారు. మొదటి పది గేముల వరకూ ఒకుహురాను రానిచ్చిన సింధూ ఆ తర్వాత చెలరేగిపోయింది. ఆమె కాన్ఫిడెన్స్ లెవల్స్ పతాకస్థాయిలో ఉన్నాయి. ప్రతీ షాట్ గెలిచాక అరుస్తూ, పిడికిలి బిగించి గెలిచానన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ తనను తాను ఉత్తేజపరుచుకుంటూ సింధూ బ్రహ్మాండంగా ఆడింది. మరి ప్రత్యర్థికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా ప్రతీ పాయింటూ గెల్చింది.. చివరకు అధ్భుతమైన షాట్ తో మ్యాచ్ ను సొంతం చేసుకుంది సింధు.

కుటుంబ సభ్యుల్లో ఆనందం
పీవీ సింధూ ఓలింపిక్స్ ఫైనల్లోకి దూస్కెళ్లడం ఆమె కుటుంబ సభ్యులను ఆనందోత్సాహాల్లో నింపింది. రియో జరుగుతున్న మ్యాచ్ ను హైదరాబాద్ లోని గోపి చంద్ అకాడమిలో కుటుంబ సభ్యులు.. క్రీడాకారులు అందరూ కలిసి చూశారు. సింధూ గెలవడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తల్లి పి. విజయ తెలిపారు. ఒలింపిక్ ప్రారంభమైన ప్రతీ రోజు గుడికి వెళ్లి పూజలు చేస్తున్నామని..రేపు కూడా సింధూ గెలవాలని పూజలు చేస్తామని ఆమె చెప్పారు. దేవుడి దయ వల్ల సింధూ బంగారు పతకం సాధిస్తుందని ఆమె తల్లి దండ్రులు విజయ, రమణ ఆశాభావం వ్యక్తం చేశారు.”

మొదటి సెట్ హోరాహోరీగా సాగినప్పుడు కాస్త ఉత్కంఠకు లోనయ్యాం. రెండో సెట్ పది పాయింట్ల వరకు కూడా ఆ ఉత్కంఠ సాగింది .అయితే రెండో సెట్ లో 15-10 ఆధిక్యం సాధించిందో అప్పు డు అనుకున్నా సింధూ విజయాన్ని సాధిస్తుందని అనుకున్నాం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది. ఇందులో ముఖ్యంగా ఆమె కోచ్ గోపీ చంద్ కృషి ఎంతో ఉంది. ఆత్మ విశ్వాసాన్ని నింపాడు. ఎంతో కష్టపడింది..చివరికి అనుకున్నది సాధించింది”. అని సింధూ తండ్రి చెప్పారు.

బంగారమే నా లక్ష్యం- సింధు
ఫైనల్లో నెగ్గి బంగారు పతకాన్ని సాధించడమే తన లక్ష్యమని చెప్పింది పీవీ సింధూ. “నేను దేన్ని తేలిగ్గా తీసుకోను.. మారిన్ చాలా టఫ్ ప్లేయర్.. నేనూ నా బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇస్తా.. స్వర్ణమే లక్ష్యంగా ఆడతా..” అని సింధూ సెమీఫైనల్ మ్యాచ్ ముగిశాక ప్రకటించింది..ఒలింపిక్స్ లో పతకం సాధించిన మహిళల్లో సింధూ ఐదోది. ఇంతకుముందు కరణం మల్లేశ్వరి, మేరీ కోమ్, సైనా నెహ్వాల్, సాక్షి మాలిక్ పతకాలు సాధించారు.

ఇవాళ మార్టిన్ తో ఢీ
సెమీ ఫైనల్లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి ఫైనల్స్లోకి దూసుకెళ్ళిన షట్లర్ పీవీ సింధూ స్పెయిన్ కు చెందిన కరోలినా మారిన్ తో తలపడుతుంది. గాయపడ్డ చైనా క్రీడాకారిణి లీలీ జురై ని ఓడించిన మారిన్ కూడా చాలా శక్తిమంతమైన క్రీడాకారిణి.2014,2015 సంవత్సరాల్లో ప్రపంచ ఛాంపియన్ షిప్ ను గెల్చుకున్న మారిన్ ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి కాగా సింధూ ప్రపంచ నెంబర్ 10 క్రీడాకారిణి. ఒకవేళ మారిన్ ను గనక సింధూ ఓడిస్తే సైనా నెహ్వాల్ కంటే కూడా ఎక్కువ పాపులారిటీ సాధించడం ఖాయం.

Leave a Reply