అఖిలేశ్ కొంప‌ముంచిన రాహుల్!!

Posted [relativedate]


కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్లే ఏదో అద్భుతం జ‌రుగుతుంద‌ని ఆశించిన అఖిలేశ్ యాద‌వ్ కు నిరాశే మిగిలింది. పొత్తుతో ఎలాంటి లాభం లేక‌పోగా.. అది బెడిసికొట్టింది. అఖిలేశ్ సొంతంగా పోటీ చేసినా ఇంత‌కంటే ఎక్కువ స్థానాలు వ‌చ్చేవ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.

అస‌లే కాంగ్రెస్ కు యూపీలో అంతంత మాత్ర‌మే బ‌లం ఉంది. ఈ విష‌యం అఖిలేశ్ కు కూడా తెలుసు. అన్నీ తెలిసి కాంగ్రెస్ కు 100 సీట్లు ఇవ్వ‌డంతో అక్క‌డే మొద‌టి దెబ్బ ప‌డింది. ఇక ప్ర‌చారంలో రాహుల్ – అఖిలేశ్ ను చూడ‌డానికి జ‌నం బాగానే వ‌చ్చినా..ఆ అభిమానం ఓట్ల‌రూపంలోకి మార‌లేదు. రాహుల్ ప్ర‌సంగాల్లో ఎలాంటి కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం… మోడీని విమ‌ర్శించ‌డ‌మే ఆయ‌న ఏకైక ఎజెండాగా ముందుకు సాగ‌డంతో ఆ ఎఫెక్ట్ స‌మాజ్ వాదీ పార్టీపై ప‌డింది. కాంగ్రెస్ ను న‌మ్మ‌ని జ‌నం… ఆ పార్టీతో జ‌ట్టు క‌ట్టిన ఎస్పీని కూడా దూరం పెట్టారు.

నిజానికి అఖిలేశ్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఉన్నా… వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు మంచి ఇమేజ్ ఉంది. ఈ విష‌యం ములాయంకు తెలుసు. అందుకే ఆయ‌న సొంతంగా పోటీచేస్తేనే మంచిద‌ని పెద్దాయ‌న మొదటి నుంచి చెబుతూ వ‌చ్చారు.కాంగ్రెస్ తో దోస్తీని తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయినా అఖిలేశ్ తండ్రిమాట‌ను పెడ‌చెవిన పెట్టారు. కోరి క‌ష్టాల‌ను తెచ్చుకున్నారు. కాంగ్రెస్ తో క‌లిసి పోటీ చేయ‌డం వ‌ల్ల దాదాపు 70, 80 సీట్లు ఎస్పీ కోల్పోవాల్సి వ‌చ్చింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ కు ఇచ్చిన చాలా సీట్లలో ఎస్పీ చాలా బ‌లంగా ఉంది. అవ‌న్నీ ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. అందుకే స‌మాజ్ వాదీ పార్టీ మొత్తం 403 సీట్ల‌లో పోటీచేసి ఉంటే.. ఫ‌లితాలు ఇప్ప‌టి కంటే మెరుగ్గా వ‌చ్చేవ‌ని ఎస్పీ క్యాడ‌ర్ అనుకుంటున్నారు.

ఇక కాంగ్రెస్ తో పొత్తు విష‌యం చివ‌రిదాకా అది తేల‌క‌పోవ‌డం… చివ‌ర‌కు కాంగ్రెస్ కు పెద్ద మొత్తంలో సీట్లు ఇవ్వ‌డంతో ఆ సీట్ల‌పైనే ఆశ‌లు పెట్టుకున్న ఎస్పీ అభ్యర్థులు… తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ తో పొత్తు వ‌ల్ల చాలామంది ఎస్పీ నేత‌లు… పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేశార‌న్న వాద‌న ఉంది. మొత్తానికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవ‌డ‌మే అఖిలేశ్ కు మైన‌స్ అయ్యింది. ఈ పొత్తుతో ఎలాంటి లాభం లేక‌పోగా.. న‌ష్టం ఎక్కువ‌గా జ‌రిగింది. అందుకే త‌మ ఓట‌మికి కాంగ్రెస్సే కార‌ణ‌మ‌ని ఎస్పీ క్యాడ‌ర్ మండిప‌డుతున్నారు. రాహుల్ గాంధీయే త‌మ కొంప ముంచార‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు.!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here