ఏప్రిల్ 2న సారొస్తున్నారా?

Posted March 30, 2017


తమిళనాడులో రాజకీయ శూన్యత నెలకొన్న తరుణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు జనం. సారొచ్చేస్తారని అభిమానులు బాగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఆయన నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు. కానీ ఈమధ్య రజినీ భార్య లత… అంతా మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు. దాంతో మరోసారి తలైవా పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా ఇప్పుడు మరో పెద్ద న్యూస్ వచ్చింది. అదేమిటంటే ఏప్రిల్ 2న అభిమాన సంఘ నేతలతో రజినీకాంత్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరు కావాలని ఫ్యాన్స్ కు ఆయన పిలుపునిచ్చారు. ఈ మీటింగ్ అజెండా ఏంటో క్లారిటీ లేదు. అయినప్పటికీ అది కచ్చితంగా పొలిటికల్ మీటింగేనన్న పుకార్లు వినిపిస్తున్నాయి. అభిమానులు దేని కోసమైతే ఎదురుచూస్తున్నారో.. ఆ శుభవార్త చెప్పడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏప్రిల్ 2న తమిళనాడు రాజకీయాలను మలుపుతిప్పే ప్రకటన రాబోతుందా? అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఇటీవల తాను శ్రీలంక పర్యటనను వాయిదా వేసుకోవడం.. ఇప్పుడు అభిమాన సంఘాలతో మీటింగ్… చూస్తుంటే రజినీ చాలా పెద్ద నిర్ణయమే తీసుకోబోతున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రజినీ భార్య చెప్పిన అంతా మంచే జరుగుతుందన్న మాటల్లో పరమార్థం ఇదేనని చెబుతున్నారు. ఏప్రిల్ 2 మీటింగ్ లో అభిమాన సంఘాలతో తలైవా అన్ని అంశాలపై మాట్లాడబోతున్నారట.

అటు రజినీకాంత్ పీఆర్వో మాత్రం పొలిటికల్ ఎంట్రీపై వస్తున్నవి ఊహాగానాలేనని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఏప్రిల్ 2 న ఏదో జరగబోతోందని తమిళజనాలు బాగానే హోప్స్ పెట్టుకున్నారు. చూడాలి మరి ఆరోజు ఏం జరుగుతుందో?

SHARE