Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశానికి తమిళ సంఘాలు ఎంత వ్యతిరేకత చూపుతున్నా ఆ రాష్ట్ర పరిస్థితులు మాత్రం అంతగా కలిసి వస్తున్నాయి. బెంగుళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న చిన్నమ్మ శశికళ పరోక్షంగా రజనికి కావాల్సిన రాజకీయ వాతావరణం సృష్టిస్తున్నారు.దినకరన్ బెయిల్ మీద బయటకు రాగానే జైలుకెళ్లి శశికళని కలిసాడు. ఎన్నికలసంఘం వ్యవహారంలో ఇబ్బంది రాగానే సీఎం పళనిస్వామి ప్లేట్ ఫిరాయించి,పన్నీర్ సెల్వంతో పార్టీ ఐక్యత గురించి చర్చలు జరపడాన్ని శశి జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ ఎంత ఒత్తిడి తెచ్చినా లెక్కచేయకుండా,తాను జైలు జీవితాన్ని అనుభవించడానికి సిద్ధపడి మరీ పళనిస్వామిని సీఎం చేస్తే ఇప్పుడు తన మాట లెక్కచేయడం లేదని శశికళ మండిపడుతున్నారు. ఇందుకు తగిన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు.దినకరన్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేల సాయంతో పళనిస్వామి సర్కార్ ని పడగొట్టేందుకు కూడా శశికళ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
శశికళ అనుకున్నట్టు జరిగితే తమిళనాట మళ్లీ ఎన్నికలు రావడం ఖాయం.రజని తాను అనుకున్నట్టు ఇప్పుడు పార్టీ పెట్టి మరో మూడేళ్లు నడిపి ఎన్నికలకు వెళ్లడమంటే చిన్న విషయం కాదు. శశి అనుకున్నట్టు పళని సర్కార్ కూలితే రజని పార్టీ ప్రకటన చేయడానికి,ఎన్నికలకు వెళ్ళడానికి మధ్య వ్యవధి తక్కువగా ఉంటుంది.అటు అన్నాడీఎంకేలో అంతర్గత కలహాలు,ఇటు డీఎంకే మీద ఇంకా సానుకూలత లేని వాతావరణం రజనికి కలిసి రావొచ్చు.ఇప్పటికే కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసి రజని తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.దీనివెనుక శశికళ హస్తం ఉందన్న వాదనలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి.ఏదేమైనా శశికళ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయంగా రజనికి రెడ్ కార్పెట్ పరిచేలా వున్నాయి.