Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు రాజకీయాలు ఎటూ తేలకుండా ఉన్నాయి. ఒకటే అనిశ్చితి. జయలలిత తరువాత ఆ స్థాయి స్టార్ డమ్ ఉన్న లీడర్లు కరవైపోయారు. దీంతో ఈ రాజకీయ శూన్యత ఉన్న సమయంలో రజనీకాంత్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందన్నది చాలామంది మనసులో మాట. కానీ ఆయన మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. అయితే… తాజాగా ఆయన అభిమానులతో వరుస సమావేశాలకు రెడీ అయిపోవడంతో రజనీ ఏదో ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం మళ్లీ మొదలైంది.
అన్నాడీఎంకేలో వర్గపోరు ముదిరింది. ఇదే టైమ్లో బీజేపీ ఇక్కడ పాగా కోసం ప్రయత్నాలు చేస్తోంది. పన్నీరు సెల్వంను నడిపించేది బీజేపీయే అనే ప్రచారం కూడా ఉంది. అటు డీఎంకే కురువృద్దుడు కరుణానిధి ఇంటికే పరిమితమయ్యారు. స్టాలిన్ ఆ పార్టీని నడిపిస్తున్నారు. ఈటైమ్లో పొలిటికల్ గ్యాప్ను పూర్తి చేయడానికి తలైవా రాజకీయాల్లోకి వస్తారా? అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. రజనీకాంత్ రాజకీయాలపై ఆసక్తి లేదని ఇంతకుముందు ప్రకటించారు. కానీ మారిన తాజా రాజకీయ పరిణామాలతో ఆయన మనసు మార్చుకున్నారనే ప్రచారం నడుస్తోంది.
రజనీ పదిరోజుల పాటు అభిమానులను కలవబోతున్నారు. రోజుకు ఏడు వేల మంది అభిమానులను ఆయన కలుసుకుంటారు. ఏప్రిల్లోనే జరగాల్సిన ఈ మీటింగ్ నెలరోజుల పాటు వాయిదా పడింది. అయితే తన పొలిటికల్ ఎంట్రీపై అభిమానుల స్పందన తెలుసుకునేందుకు రజనీ ఈ మీటింగ్ ఏర్పాటు చేశారని కొందరు అంటున్నారు. ఇప్పటికే ఓసారి రాజకీయాల్లో స్టేట్ మెంట్లు ఇచ్చి చేతులు కాల్చుకున్న రజినీ.. మరి ఈసారైనా స్టెప్ వేస్తారో లేదో చూడాలి.