ఈరోజు రజని మాట మారింది …కొత్త పార్టీ ఖాయం.

Posted May 19, 2017 at 13:13

rajinikanth political entry confirm he is start new political party
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసిపోయింది.అలాగే సగటు సినీ,రాజకీయ అభిమానుల్ని దశాబ్దాలుగా వేధిస్తున్న ఇంకో ప్రశ్నకి సమాధానం దొరికింది.అదే రజని రాజకీయ రంగప్రవేశం.నిన్న సాయంత్రం రాజకీయాల గురించి అడగొద్దని చెప్పిన రజని ఒక్కసారిగా గేర్ మార్చేశాడు.ఒక్క రోజు వ్యవధిలో టాప్ స్పీడ్ లో తన పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే రీతిలో డైలాగ్స్ చెప్పేసాడు.రజని తన రాజకీయ రంగ ప్రవేశానికి ఏది అడ్డంకి అని భావించాడో,దేన్ని ప్రత్యర్ధులు అస్త్రంగా మలుచుకుంటారని ఆందోళన చెందాడో దాని గురించే ఈ రోజు మాట్లాడారు. రజని రాజకీయ రంగ ప్రవేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు తొలుత ప్రస్తావించేది ఆయన తమిళుడు కాదన్న విషయాన్ని.కానీ రజని దానికి తిరుగులేని జవాబిచ్చాడు.

రజని తనని తాను నిజమైన తమిళుడిగా అభివర్ణించుకున్నాడు.తాను కర్ణాటకలో 23 ఏళ్ళు,తమిళనాట 43 ఏళ్ళు నివసించినట్టు చెప్పుకున్నారు.పుట్టుకతో మరాఠి అయిన రజని కుటుంబం కర్ణాటకలో ఎక్కువగా వుంది.అక్కడి నుంచే వచ్చిన తనని అభిమానించి నిజమైన తమిళుడిగా మార్చారని ఆయన అభిమానుల ని ఉద్దేశించి భావోద్వేగంతో చెప్పిన మాటలు ఆసక్తి రేపాయి. నేను లోకల్ అంటూ రజని ఇక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని దాదాపుగా తేలిపోయింది.

తాజా మాటలతో తాను లోకల్ కాదన్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టిన రజని కొత్త పార్టీ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.ఎన్నో పార్టీలు ఆయన్ని ఆహ్వానిస్తున్నప్పటికీ కొత్త పార్టీ వైపే రజని మొగ్గుజూపుతున్నట్టు ఆయన మాటలతో అర్ధం అవుతోంది.”ప్రస్తుతమున్న రాజకీయ పక్షాలు ప్రజల గురించి ఆలోచించడం లేదు.వారికి కనీస విలువ ఇవ్వడం లేదు.ఈ పరిస్థితి మారాలి.అందుకోసం అవసరమైతే అందరం కలిసి పనిచేద్దాం” ఇలా చెప్పి పాత పార్టీల తప్పుల్ని నెత్తికి ఎత్తుకోడానికి రజని సిద్ధంగా లేరని తేలిపోయింది.కొత్త పార్టీ కి రెడీ అయ్యాకే ఆయన ఈ ప్రకటన చేశారని రజని గురించి తెలిసిన వాళ్ళు చెపుతున్న మాట.అదే నిజమైతే దశాబ్దాలుగా తలైవా ఫాన్స్ కంటున్న కల నిజమైనట్టే.

SHARE