పాడిందే పాట…రజని మాట

 Posted March 23, 2017

rajinikanth tweet Support no one in rk nagar by-poll elections
రజని ఈసారి ఎలాగైనా రాజకీయాల్లోకి వస్తాడని తలైవా ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆర్కే నగర్ లో బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ ని ఇంటికి పిలిచి ఓ ఫోటో తీసుకున్నారు.దాన్ని గంగై అమరన్ బయటపెట్టాడు.ఇక ఆయన కొడుకు వెంకట్ ప్రభు కూడా”తన తండ్రి గెలవాలని రజని ఆకాంక్షించారు “అని ఓ ట్వీట్ వేయడంతో ఇక రజని రాజకీయ రంగ ప్రవేశం ఖాయమని ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలారు.ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అనుకున్న టైం లో తలైవా వారి ఆశల మీద నీళ్ల్లు చల్లేశారు.పాడిందే పాటరా పాచిపళ్ళ దాసుడా అన్న సామెతని గుర్తు చేస్తూ తాను ఆర్కే నగర్ ఉప ఎన్నికల సందర్భంగా ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని రజని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

చిరకాల మిత్రుడు,వెండి తెర ప్రత్యర్థి కమల్ రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న సందర్భంలో రజని కూడా మనసు మార్చుకుంటాడని తలైవా ఫ్యాన్స్ భావించారు.అయితే రజని తాజా ప్రకటనతో వారికి ఇంకోసారి నిరాశే మిగిలింది.ఈ పరిస్థితుల్లో ఇక రజని మద్దతు కోసం ప్రయత్నించడం దండగని రాజకీయ పార్టీలు కూడా డిసైడ్ అవుతున్నాయి.ఇక రజని అంటే పడిచచ్చిపోయే ఓ అభిమాని కూడా భలే కామెంట్ చేసాడు.ఆ కామెంట్ సారాంశం ఏమిటంటే …”రజని రాజకీయ రంగంలోకి దిగడం గురించి తాత్కాలిక ప్రకటనలు చేయడం మానుకుని …జీవితంలో ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని ఓ స్టేట్ మెంట్ ఇస్తే మంచిది.ఆ పైవాడు చెప్పింది చేస్తానని పరోక్ష ప్రకటనలు ఆపితే మాకు ఎప్పటికప్పుడు నిరాశ లేకుండా ఉంటుంది”. నిజమే …ఆ అభిమాని చెప్పినట్టు చేస్తే రాజకీయాల బాధ రజనికి,రజని గోల రాజకీయాలకి తప్పుతుంది.ఏమంటారు ?

 

SHARE