Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు. ఇప్పటికే ఆ విషయంపై క్లారిటీ వచ్చేసింది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. అతి త్వరలోనే రజినీకాంత్ కొత్త పార్టీ పెట్టడమా లేక జాతీయ పార్టీ అయిన బీజేపీలో జాయిన్ అవ్వడమా జరుగుతుంది. త్వరలోనే అందుకు సంబంధించిన ఒక నిర్ణయం రజినీకాంత్ నుండి వెలువడుతుందని అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే రజినీకాంత్ సినిమాల గురించి తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ప్రస్తుతం రజినీకాంత్ ‘రోబో’కు సీక్వెల్‌గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘2.0’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమాతో పాటు తాజాగా ‘కబాలి’ దర్శకుడు రంజిత్ పా దర్శకత్వంలో ‘కాలా’ అనే ఒక మాఫియా నేపథ్యం ఉన్న సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత రజినీకాంత్ కొత్త సినిమాలేం చేయడని ప్రచారం జరుగుతుంది. అయితే అవన్ని ఒట్టి అవాస్తవాలు అని ‘కాలా’ వచ్చే సంవత్సరంలో విడుదల కాబోతుంది. ఆ వెంటనే ధనుష్ దర్శకత్వంలో ఒక సినిమాను రజినీకాంత్ చేస్తాడని తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. తన మామతో ఒక సినిమా చేయాలని ధనుష్ చాలా రోజులుగా ఆశిస్తున్నాడు. అందుకు రజినీకాంత్ కూడా ఓకే చెప్పాడు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో రజినీకాంత్ రాజకీయాల్లోకి వెళ్లినా కూడా సినిమాలు చేస్తూనే ఉంటాడని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఇంకా దాదాపు నాలుగు సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో రజినీకాంత్ ఇప్పట్లో సినిమాలకు గుడ్‌బై చెప్పడని కొందరు విశ్లేషిస్తున్నారు. అందుకే ‘కాలా’ రజినీకాంత్ చివరి సినిమా కాదంటూ తమిళ సినీ వర్గాల వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.