Posted [relativedate]
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ‘ధృవ’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని సుకుమార్ దర్శకత్వంలో చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇదే. సుకుమార్ సినిమా అంటే విభిన్న స్క్రీన్‌ప్లే ఉంటుంది. హీరో లుక్ కూడా విభిన్నంగా ప్లాన్ చేస్తాడు దర్శకుడు. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఈ చిత్రం కోసం హీరో రామ్‌చరణ్‌ను చెవిటి వాడిగా దర్శకుడు సుకుమార్ చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ విషయంపై ఇప్పటికే ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చరణ్ వినికిడి లోపంతో కనిపిస్తాడని చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా ఒప్పుకున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ముద్దుగుమ్మ సమంత మూగ పాత్రలో నటించబోతుందనే షాకింగ్ వార్తలు వచ్చాయి. చరణ్ చెవిటి, సమంత మూగ ఈ చిత్రం ఒక ఆర్ట్ సినిమా అవుతుందని, దీనిని చూడటం కష్టమే అంటూ మెగా ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. మెగా మూవీ అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. కాని ఇదో ఆర్ట్ సినిమాగా ఉంటే ఇప్పుడు ఎవరు చూస్తారు అని స్వయంగా మెగా ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.
ఈ సమయంలోనే చిత్ర యూనిట్ సభ్యులు ఒక క్లారిటీ ఇచ్చారు. సమంత ఈ చిత్రంలో మూగ అమ్మాయి కాదని, ఇది పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, విభిన్న స్క్రీన్‌ప్లేతో సుకుమార్ స్టైల్‌లో చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దాంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. హాట్ యాంకర్ అనసూయ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. దసరా కానుకగా విడుదల చేసేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.