Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అనే సామెత తెలిసే ఉంటుంది. ఇప్పుడు అదే చందాన బాహుబలిని చూసి ఇతర ఫిల్మ్ మేకర్స్ వాతలు పెట్టుకునేందుకు సిద్దం అవుతున్నారు. అయితే ఆ వాతలు సక్సెస్ అవుతాయా లేక ఫ్లాప్ అవుతాయా అనేది చూడాల్సి ఉంది. ‘బాహుబలి’ భారీ వసూళ్లు సాధించిన వెంటనే అల్లు అరవింద్ బాలీవుడ్ నిర్మాతతో కలిసి ‘రామాయణం’ చిత్రాన్ని 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. ఇక తమిళంలో సంఘమిత్ర అనే చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. అదే దారిలో చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ కూడా నడుస్తుంది.
చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెం.150’ విడుదలైన కొన్ని రోజులకు ఉయ్యాలవాడ ప్రాజెక్ట్‌ను 151వ సినిమాగా ఫైనల్ చేశారు. మొదట 60 నుండి 70 కోట్లు అనుకున్నారు. ఆ తర్వాత 100 కోట్లకు బడ్జెట్ పెంచారు. ఇప్పుడు ‘బాహుబలి 2’ విడుదలై 1400 కోట్లను వసూళ్లు చేసిన నేపథ్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బడ్జెట్‌ను అమాంతం 130 కోట్లకు పెంచినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఆగస్టులో సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్‌ను కూడా ఈ సినిమాలో నటింపజేసి హిందీలో భారీగా బిజినెస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఉయ్యాలవాడ కోసం చరణ్ చేస్తున్న ప్రయోగం సఫలం అయ్యేనా లేక విఫలం అయ్యేనా అనేది చూడాలి.