Posted [relativedate]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పల్లెటూరి ప్రేమ కధల బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమా ఆగష్టులో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత చెర్రీ.. మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పేశాడు. ఈ సినిమా జూన్ నుండి ప్రారంభం కానుందని సమాచారం.
గీతాంజలి తరవాత మణిరత్నం స్ట్రైట్ తెలుగు సినిమా చేయలేదు. ఆయన రూపొందించిన తమిళ సినిమాల్నే తెలుగులో డబ్ చేసి అందించారు మన దర్శకనిర్మాతలు. అయితే గత కొంతకాలంగా ఓ తెలుగు సినిమా చేయాలని తెగ ప్రయత్నిస్తున్నాడు మణిరత్నం. మహేష్ బాబుకి కధ చెప్పినా వర్కౌట్ అవ్వలేదట.. ఇక నాగార్జున డేట్స్ లేకపోవడంతో చెర్రీని సెలెక్ట్ చేసుకున్నాడట ఈ దర్శకుడు. ఇటీవల మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంకి వచ్చిన సుహాసినీ కూడా ఈ మేరకు చిరుతో సంప్రదింపులు జరిపిందట. చిరు కూడా ఓకే చెప్పడంతో ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.
ఈ చిత్రంలో చరణ్ రా ఏజెంట్గా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ తరహా పాత్ర చేయడం చరణ్ కి ఇదే తొలిసారి. మణిరత్నం అంటే బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. అలానే చెర్రీ కూడా జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట మణిరత్నం. ప్రస్తుతం మణిరత్నం … కార్తీతో తెరకెక్కిస్తున్న చెలియా సినిమా పనులు పూర్తవ్వగానే… చరణ్ సినిమాను మొదలుపెట్టనున్నారట. గీతాంజలి వంటి ప్రేమ కధలను తెరకెక్కించిన మణిరత్నం చెర్రీని రా ఏజెంట్ గా ఎలా చూపిస్తాడో చూడాలి.