ఒకప్పుడు అన్ని భాషల్లో కూడా పౌరాణిక చిత్రాలు చాలా వచ్చేవి. తెలుగులో ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీఆర్ వంటి వారు పౌరాణిక చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పౌరాణిక చిత్రాలు అంటే కాస్త కష్టంతో కూడుకున్న పని, పైగా ఇప్పుడు ప్రేక్షకులు పౌరాణికాలను ఆధరిస్తారా అనేది అనుమానం ఇన్నాళ్లు ఉండేది. కాని కంటెంట్ సరిగా ఉంటే తప్పకుండా ఆధరిస్తారు అంటూ ‘బాహుబలి’ నిరూపించింది. దాంతో మళ్లీ ఇప్పుడు పౌరాణిక చిత్రాల వెంట సినీ ప్రముఖులు పడుతున్నారు.
‘బాహుబలి’ని ఆదర్శంగా తీసుకుని వెయ్యి కోట్ల బడ్జెట్తో ‘మహాభారతం’ చిత్రాన్ని చేసేందుకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నాు మొదలు పెట్టిన విషయం తెల్సిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మరియు నటీ నటుల ఎంపిక పక్రియ షురూ అయ్యింది. వచ్చే సంవత్సరంలో మహాభారతంను సెట్స్ పైకి తీసుకు వెళ్లి 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే రామాయణం సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఆశిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాతతో కలిసి ‘రామాయణం’ను నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. తెలుగుతో పాటు హిందీ మరియు తమిళంలో కూడా ఆ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తి 3డి చిత్రంగా అది ఉంటుందని నిర్మాత అల్లు అరవింద్ చెబుతున్నాడు. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి బాహుబలి పుణ్యమా అని వరుసగా మహాభారతం మరియు రామాయణం చిత్రాలు చూసే భాగ్యం ఈ తరం ప్రేక్షకులకు దక్కింది.