Posted [relativedate]
కంభంపాటి రామ్మోహన్ రావు. చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా 1990 దశాబ్దంలో ఢిల్లీలో చంద్రబాబు తిప్పడంలో ఈయన తెరవెనుక కీలకపాత్ర పోషించారని చెబుతారు. కంభంపాటికి పలు జాతీయ పార్టీల నాయకులతో పరిచయాలున్నాయి. అందుకే చంద్రబాబు ఏరికోరి ఆయనను ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. అయితే బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు కావడానికి ఎంతో టైమ్ పట్టదు. కాబట్టి కంభంపాటికి ప్రాధాన్యత తగ్గింది.
ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న తరుణంలో ఎంపీలంతా ఆయనతోనే పనులు చేయించుకునేవారు. కేంద్రమంత్రులు, జాతీయ నాయకులను కలవాలంటే ఆయనను వెంట తీసుకునేవారు. దీంతో ఢిల్లీలో ఆయన ఒక పవర్ సెంటర్ గా ఎదిగారు. కానీ సుజనా చౌదరి కేంద్రమంత్రి అయిపోవడంతో అక్కడ ఇంకో పవర్ సెంటర్ వచ్చింది. తనకు కేంద్రమంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఎంపీలు కొందరు కంభపాటి దగ్గరకు వెళ్లడం సుజనాకు నచ్చలేదట. ఇలా అయితే తనకు ప్రాధాన్యం తగ్గుతుందని ఫీలయ్యారో.. మరో కారణమో తెలియదు కానీ చంద్రబాబు దగ్గర చక్రం తిప్పారట.
కారణమేంటో తెలియదు కానీ చంద్రబాబు కూడా కంభంపాటికి ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించేశారట. ఆయనతో మాట్లాడి చాలా రోజులే అయ్యిందని టాక్. ఇక ఈలోపు ఆయన పదవీకాలం ముగిసినా బాబు పట్టించుకోలేదట. కంభంపాటి పదవి రెన్యువల్ కాలేదు. దీంతో సుజనా అనుకున్నదే జరిగింది. కంభంపాటి పదవీకాలం పూర్తయిపోయింది.
మొత్తానికి సుజనా చౌదరి… చాలా తెలివిగా కంభంపాటికి చెక్ పెట్టారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నాయకుడికి ఈ రకంగా చెక్ పెట్టడం సుజనాకే సాధ్యమైందంటూ క్యాడర్ చర్చించుకుంటున్నారు.