సీఎం అవుతానంటున్న కొత్త ఎమ్మెల్యే!!

0
428
rammohan reddy fired on current line men

Posted [relativedate]

rammohan reddy fired on current line men
తెలంగాణలో ప‌రిగి ఎమ్మెల్యే రామ్మోహ‌న్ రెడ్డి మొద‌టిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా త‌క్కువ మెజార్టీతో. ఎందుకంటే అక్క‌డ టీఆర్ఎస్ నుంచి రాజ‌కీయ ఉద్దండుడు హ‌రీశ్వ‌ర్ రెడ్డి పోటీ చేశారు. ఇప్ప‌టికే నాలుగైదు సార్లు గెల‌వ‌డంతో ఆయ‌న‌పై కొంత వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఆ దెబ్బ‌తో అతి త‌క్కువ మెజార్టీతో రామ్మోహ‌న్ రెడ్డి గెలిచారు. ఆ వాపును చూసి బ‌లుపు అనుకుంటున్నారు ఈ ఎమ్మెల్యే గారు. పిచ్చుకపై బ్ర‌హ్మాస్త్రంలా ఓ లైన్ మెన్ పై బూతు పురాణం అందుకున్నారు. ఆ బూతుల్లో భాగంగా తాను సీఎం అవుతానంటూ నోటికొచ్చిన‌ట్టు మాట్లాడారు.

రామ్మోహ‌న్ రెడ్డి త‌న ఇంటికి క‌రెంటు బిల్లులు చెల్లించ‌లేదు. విద్యుత్ సిబ్బంది బిల్లు అడిగినందుకు ఎమ్మెల్యే పీఏ అశోక్ రెడ్డికి కోప‌మొచ్చింది. లైన్ మెన్ ను దుర్భాష‌లాడాడు. అత‌ను ఉన్న‌తాధికారుల‌కు చెప్ప‌డంతో వారు ఎమ్మెల్యే ఇంటికి క‌రెంట్ క‌ట్ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహంతో లైన్‌మెన్ రమేశ్‌కు ఫోన్ చేసి బూతుపురాణం అందుకున్నారు. లైన్ మెన్ ను ఇంటికి పిలిపించి పీఏతో కొట్టించారు.

నువ్వెంత‌..! నీ బ‌తుకెంత‌…! నా ఇంటికే క‌రెంటు క‌ట్ చేస్తారా…? మా ఇంటికి రా..! నేనేంటో చూపిస్తా…! ఎమ్మెల్యే అంటే ఏమ‌నుకుంటున్నావు..? రేపు క‌రెంట్ మంత్రి అవుతా..! ముఖ్య‌మంత్రి కూడా అవుతానంటూ …! ఇష్టానుసారం మాట్లాడారు. అస‌లు క‌రెంటు క‌ట్టక‌పోవ‌డం మొద‌టి త‌ప్పు. దానిపై విద్యుత్ సిబ్బందిని తిట్ట‌డంమ‌రో త‌ప్పు. అదీ చాల‌ద‌న్న‌ట్టు లైన్ మెన్ ను ఇంటికి పిలిచి పీఏతో కొట్టించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బో ఎమ్మెల్యేకే తెలియాలి.

ఎమ్మెల్యేగా. త‌ప్పు చేయ‌డ‌మే కాకుండా దానికి క‌రెంట్ మంత్రి అవుతా…! ముఖ్య‌మంత్రి అవుతానంటూ బీరాలు ప‌ల‌క‌డం స‌రికాద‌నే వాద‌న వినిపిస్తోంది. అస‌లే కాంగ్రెస్ క‌ష్ట‌కాలంలో ఉంది. సీఎం కేసీఆర్ జోరుమీదున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ లో చాలామంది ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థులున్నారు. తాజాగా మ‌రో వ్య‌క్తి సీఎం అవుతాన‌ని చెప్ప‌డంతో ఆ పార్టీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం పోస్టంటే అదేమ‌న్నా సంత‌లో దొరికే ప్లాస్టిక్ కుర్చీనా అని గుస‌గుస‌లాడుకుంటున్నారు. ముందు సీఎం క‌ల‌లు మాని … ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేగా కొంత త‌గ్గి మాట్లాడితే బావుంటుందని కాంగ్రెస్ సీనియ‌ర్లు… ఎమ్మెల్యే రామ్మోహ‌న్ రెడ్డికి త‌లంటిన‌ట్టు స‌మాచారం.

Leave a Reply