రంగా రెడ్డి ఇక1/3

 rangareddy district divided 2 new districtsరంగారెడ్డి జిల్లాను మూడు భాగాలుగా విభజించి రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వికారాబాద్ కేంద్రంగా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్లలను రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేయడంతో పాటు ఐటి సెక్టార్ పూర్తిగా ఒకే జిల్లాలో ఏర్పాటు చేసేందుకు శంషాబాద్ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. దీనిలో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీపట్నం, ఎల్‌బినగర్ నియోజకవర్గాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలను షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిని చేర్చారు.

అలాగే ఉప్పల్, మేడ్చెల్, కుత్భుల్లాపూర్, మల్కాజిగిరి, కూకుట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గాలతో మల్కాజిగిరి జిల్లాగా ప్రతిపాదించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఐదు రెవెన్యూ డివిజన్లలో వికారాబాద్, చేవెళ్ల డివిజన్లు రంగారెడ్డి జిల్లా పరిధిగా నిర్ణయించగా సరూర్‌నగర్, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్లను శంషాబాద్ జిల్లాగా ప్రతిపాదించారు. ఈ డివిజన్ల పరిధికి కొత్తగా మహబూబ్‌నగర్ జిల్లా, షాద్‌నగర్ నియోజకవర్గం నాలుగు మండలాలను చేరుస్తుండగా రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బాలానగర్ మండల పరిధిని మల్కాజిగిరి జిల్లాకు కేటాయిస్తూ ప్రతిపాదించారు.

ఈ జిల్లాలో ఒక్కటే మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్ ఉండగా కొత్తగా కీసర పేరుతో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. అలాగే జిల్లాలో వికారాబాద్ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలో కోట్‌పల్లి ప్రాంతంలో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తుండగా మల్కాజిగిరి జిల్లాలో జవహర్‌నగర్, మేడిపల్లి మండలాలను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. శంషాబాద్ జిల్లా పరిధిలో ఉప్పల్, సరూర్‌నగర్, హయత్‌నగర్ మండలాల పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ప్రత్యేకంగా ఎల్‌బినగర్ పేరుతో ఒక కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న సరూర్‌నగర్, హయత్‌నగర్ మండలాల పేర్లు కనుమరుగు కానున్నాయి. వీటి స్థానంలో బాలాపూర్, అబ్ధుల్లాపూర్ మెట్ మండలాలు కాబోతున్నాయి. శంషాబాద్ జిల్లా ఐటి కారిడార్‌గా ఏర్పాటు కావడంతో పాటు విఐపీ జోన్‌గా మారనుంది. ప్రస్తుతం ప్రతిపాదనలు చేస్తున్న మూడు జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం రంగారెడ్డి (వికారాబాద్) జిల్లాలో 14లక్షలు, శంషాబాద్ జిల్లాలో 20లక్షలు, మల్కాజిగిరి జిల్లాలో 27లక్షల జనాభా ఉంది.

ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలు కావడంతో జిల్లా కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేస్తారో నన్న అయోమయానికి జిల్లా యంత్రాంగం కొంత మేరకు సూచన ప్రాయంగా ఔటర్ రింగ్‌రోడ్డు గ్రోత్ కారిడార్ పరిధిలో ఏర్పాటు కావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. శంషాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు శ్రీశైలం హైవే, నాగార్జునసాగర్ హైవేల మధ్య ప్రదేశంలో ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

అలాగే మల్కాజిగిరి జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేందుకు కీసర ప్రాంతంలో ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోనే స్థలాన్ని అనే్వశిస్తున్నట్లు సమాచారం. ప్రజలకు రవాణా సౌకర్యంతో పాటు అన్ని రకాల వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే అవకాశం ఉన్న ప్రాంతాన్ని జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్ పరిపాలనా సౌలభ్యం గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారో ప్రభుత్వం ప్రకటించకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

SHARE