Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీటీడీ ఛైర్మన్ పదవీకాలం పూర్తవడమేమో కానీ చంద్రబాబుకు మాత్రం కొత్త తలనొప్పి మొదలైంది. ఆ పదవి తమకు కావాలంటే తమకంటూ టీడీపీ నేతలు చంద్రబాబు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అనుంగు అనుచరుడు మురళీమోహన్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి ఎంపీ అయిన రాయపాటి సాంబశివరావు ఇద్దరూ దీనికి పోటీ పడుతుండడంతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.టీటీడీ చైర్మన్ గా పని చేయడం తన చిన్ననాటి కలని మురళీమోహన్ వెల్లడించగా ఆ పదవిపై తనకు ఎన్నో సంవత్సరాలుగా ఆసక్తి ఉందని రాయపాటి చెబుతున్నారు.
ఈ ఇద్దరూ చంద్రబాబును తాజాగా మరోసారి కలిశారు. అయితే… తమ భేటీ పదవి కోసం కాదని మాత్రం వారు చెబుతున్నారు. సీఎంతో భేటీ అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ 26 నుంచి జరిగే తానా సభలకు తనకు ఆహ్వానం రావడంతో వెళ్లేందుకు చంద్రబాబు అనుమతి తీసుకునేందుకు వచ్చానని చెప్పారు. ఇక రాయపాటి మాట్లాడుతూ యూఎస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని రాష్ట్రానికి కొత్త కంపెనీలను తెచ్చిన ముఖ్యమంత్రిని అభినందించేందుకు వచ్చానని వెల్లడించారు.
అయితే… ఇద్దరు నేతలూ టీటీడీ చైర్మన్ పదవి తనకు ఇవ్వాలంటే తనకు ఇవ్వాలని చంద్రబాబును కోరినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. కానీ చంద్రబాబు ఇద్దరిలో ఎవరికీ స్పష్టమైన హామీ ఇవ్వలేదని.. అవకాశముంటే పరిశీలిస్తానని మాత్రమే చెప్పారని తెలుస్తోంది. ఈ ఇద్దరూ పోటీ పడుతున్న నేపథ్యంలో వీరికి కాకుండా వేరే ఎవరికైనా ఇచ్చే ఉద్దేశం ఆయనకు ఉందని టీడీపీ నేతలు అంటున్నారు.