Posted [relativedate]
తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లాల్లో నల్గొండ, మహబూబ్ నగర్ తర్వాతి వంతు ఖమ్మందే. కానీ ఆ బలమైన పునాదులను సొంత పార్టీ నేతలు కూలుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్గాలుగా విడిపోయి… అంతిమంగా పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన జన ఆవేదన సభలో ఇదే రుజువైంది.
జన ఆవేదన సభ సాక్షిగా ఖమ్మం కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సాక్షిగా కొట్టుకున్నంత పని చేశారు ఖమ్మం లీడర్లు. సభలో మాజీ ఎంపీ రేణుకా చౌదరి అంతా తానై చూసుకున్నారు. అదే సమయంలో ఇది ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వర్గానికి మింగుడు పడలేదు. దీంతో ఆయన వర్గం నేతలు డిగ్గీరాజా ఎదురుగానే నిరసన తెలిపారు. ఇది పక్కనబెడితే మరికొంతమంది సెకండ్ క్యాడర్ నేతలు కూడా రేణుక తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఎమ్మెల్యే భట్టి విక్రమార్క వర్గం మాత్రం ఈ సన్నివేశాలను చూస్తూ మౌనంగా ఉండిపోయింది. అసలు సభలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పొంగులేటి ముఖంలో అసంతృప్తి కొట్టిచ్చినట్టు కనిపించింది. అటు రేణుక చౌదరి ముఖం కూడా ఆగ్రహజ్వాలలు ప్రత్యక్షమయ్యాయి.
ఆవేదన సభలో వర్గాల కొట్లాట పీక్ స్టేజ్ కు చేరడంతో వచ్చిన కార్యకర్తలంతా విసిగిపోయారు. ఈ లొల్లి కొనసాగుతుండగానే కుర్చీలు ఖాళీ అయిపోయాయి. కరెక్ట్ గా డిగ్గీరాజా ప్రసంగం మొదలయ్యే సమయానికి సభ వెలవెలబోయింది. వేదికపై ఉన్న నాయకులు తప్ప కింద క్యాడర్ ఎవరూ కనిపించలేదు. దీంతో ఆయన పొడిపొడి మాటలతోనే మమ అనిపించారు. వెంటనే అక్కడ్నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.
ఇలాగైతే ఖమ్మంపైనా ఆశలు వదులుకోక తప్పదని డిగ్గీరాజా .. జానారెడ్డితో చెప్పారట. రేణుక- పొంగులేటి వర్గాలు డిష్యుం డిష్యుం అంటుంటే.. మీరేం చేస్తున్నారని ఉత్తమ్ పై అసహనం వ్యక్తం చేసినట్టు టాక్. మరి ఇప్పటికైనా ఖమ్మం నేతలు దారికొచ్చి కాంప్రమైజ్ అవుతారా.. చేజేతులారా పార్టీ ఓటుబ్యాంకును దెబ్బతీస్తారా .. చూడాలి!!