రిజర్వేషన్లకు కేంద్రమే కీలకం

Posted April 16, 2017

reservations in apand telanganaరిజర్వేషన్లు ముస్లింలకు 12శాతానికి, షెడ్యూల్డ్‌ తెగలకు 10 శాతానికి పెంచడానికి రూపొందించే బిల్లు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించాక దాన్ని కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయాలని కోరుతూ రాష్ట్రపతికి పంపాలనీ, తర్వాత ఇది చట్టమయ్యాక దాన్ని 9వ షెడ్యూలులో చేర్చడానికి రాజ్యాంగ సవరణ బిల్లు రూపొందించి, అది పార్లమెంటు ఆమోదం పొందేలా చూడాలని కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించాల్సి ఉంటుంది.

1993 నవంబర్‌లో తమిళనాడు ప్రభుత్వం చేసినట్టు వీలైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏకాభిప్రాయసాధనతో ఈ పనిచేస్తే మేలు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తీర్మానం అందుకున్నాక కేంద్రసర్కారు వెంటనే దాన్ని పరిశీలనకు తీసుకోవచ్చు. ఒక వేళ తీర్మానంలోని అంశాలతో విభేదిస్తే దాన్ని పట్టించుకోకుండా పక్కనపడేసే అవకాశం లేకపోలేదు.ఇప్పటికే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తమకు అంగీకారం కాదని ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ వంటి కేంద్ర మంత్రులు తేల్చిచెప్పిన కారణంగా కేంద్ర కేబినెట్‌ తెలంగాణా అసెంబ్లీ నుంచి వచ్చిన కోటా పెంపు తీర్మానాన్ని తొలుత ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదానికి పంపే అవకాశాలు ప్రశ్నార్ధకమే.

కేంద్రం దీన్ని పరిగణనలోకి తీసుకుంటే మొదట కేంద్ర హోంమంత్రి అన్ని రాజకీయపక్షాలతో సమావేశం ఏర్పాటుచేసి, అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగ సవరణ బిల్లు రూపొందించే పని కేంద్ర న్యాయశాఖకు అప్పగిస్తారు. ఈ బిల్లును పార్లమెంటు ఉభయసభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాక రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి ఆమోదం తెలిపితే తెలంగాణ రిజర్వేషన్‌ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చుతారు. ఇప్పుడు తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. కేసీఆర్ కు రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి ఝలక్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

SHARE